= చేజారుతున్న కీలక నేతలు, కార్పొరేటర్లు
= పక్క చూపులు చూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం
= ‘కారు’కు పూర్వ వైభవం తెచ్చేందుకు కేసీఆర్ స్కెచ్
= తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ‘డిజిటల్’ బాధ్యతలు
= ఉమ్మడి జిల్లాలో జోరు పెంచిన ముగ్గురు మంత్రులు
= అభివృద్ధి, ప్రభుత్వ పథకాలతో ముందుకు
= ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న పువ్వాడ, వద్దిరాజు
= ఖమ్మం కార్పొరేషన్‌పై జెండా పాతేందుకు రెండు పార్టీల గురి
వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో
తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు తగిలిన వరుస ఎదురుదెబ్బలతో ప్రస్తుతం ఖమ్మం జిల్లా ‘కారు’లో తీవ్ర నిస్తేజం ఆవరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ వలసలు పెద్ద ఎత్తున చోటుచేసుకోవడం క్షేత్రస్థాయి క్యాడర్‌ను తీవ్ర అయోమయంలోకి నెట్టింది. ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అత్యధిక మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కీలక నేతలు గులాబీ కండువా విడిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వంటి సీనియర్ నేతలు జిల్లాలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్లో ధైర్యం నింపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కార్యకర్తలు పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల జోరు..
మరోవైపు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా తయారైంది. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క తమదైన శైలిలో జిల్లాపై పూర్తి పట్టు సాధించి దూసుకుపోతున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల వేగం, రాజకీయ వ్యూహాలతో ఈ మంత్రుల త్రయం గులాబీ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సైతం బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో ఈ ముగ్గురు మంత్రులు విజయవంతమయ్యారు. అధికార బలం, మంత్రుల హవా ముందు బీఆర్ఎస్ లీడర్లు నిలదొక్కుకోవడం క్షేత్రస్థాయిలో పెద్ద సవాల్‌గా మారింది.
ఖమ్మంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
ఖమ్మం జిల్లాలో పార్టీ క్యాడర్ నీరసించిపోవడం, వలసలు పెరగడాన్ని గమనించిన గులాబీ బాస్ కేసీఆర్.. ఈ కోటను మళ్లీ బలోపేతం చేయడానికి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పాత వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ ఖమ్మం’కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు అప్పగించారు. కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తక్కెళ్లపల్లి రవీందర్ రావు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ నిస్తేజంలో ఉన్న క్యాడర్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
కార్పొరేషన్ కైవసం సాధ్యమేనా?
ప్రస్తుత పరిస్థితుల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌ను మళ్లీ కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమేనా? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. అయితే, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాత్రం కార్పొరేషన్ పీఠంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందడం, ముఖ్యంగా రైతుబంధు జాప్యం, రుణమాఫీ లొసుగులు, ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఆక్రందనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను, స్థానిక సమస్యలను అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తే.. మంత్రుల జోరును అడ్డుకుని ఖమ్మం కార్పొరేషన్‌పై మళ్లీ గులాబీ జెండా ఎగరేయడం అసాధ్యమేమీ కాదని కేసీఆర్ అండ్ టీమ్ భావిస్తోంది. తక్కెళ్లపల్లి నేతృత్వంలో సాగుతున్న ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు, కేడర్ పునరుజ్జీవన చర్యలు ‘కారు’కు ఏ మేరకు మైలేజ్ తెస్తాయో చూడాలి.