సంజయ్ ను ఇరుకునపెడుతున్న బీఆర్ఎస్
= భగీరథ్ పోక్సో కేసుతో రాజకీయ రణరంగం
= రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల భారీ ఆందోళనలు
= కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్.
= కరీంనగర్‌లో కౌశిక్ రెడ్డి వివాదంతో మొదలైన రగడ
= కుమారుడి ఉదంతాన్ని అస్త్రంగా చేసుకున్న కారు పార్టీ
= గతంలో ఇరుకున పెట్టిన బండికి చెక్ పెట్టే వ్యూహం
= భవిష్యత్ ఎన్నికలకూ అడ్డు తొలగించుకునే ప్రయత్నం
= వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న గులాబీ దళం

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘బండి’ వర్సెస్ ‘బీఆర్ఎస్’ యుద్ధం పతాక స్థాయికి చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతాన్ని అస్త్రంగా చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ, బండి సంజయ్‌ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టడమే కాకుండా, భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని నినదిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను తొలగించాలనే డిమాండ్‌తో కారు పార్టీ నేతలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్‌లో మొదలైన రణరంగం..
అసలు ఈ ఘర్షణ వాతావరణానికి బీజం కరీంనగర్‌లో పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ వర్గీయులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద గొడవకు దిగడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బంద్‌కు పిలుపునివ్వడంతో జిల్లా మొత్తం రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఆయుధాన్ని అందించినట్లయింది. బండి వర్గీయులు చేసిన గొడవకు కౌంటర్ ఇచ్చే క్రమంలో భగీరథ్ కేసును బీఆర్ఎస్ ఇప్పుడు గట్టిగా వాడుకుంటోంది.

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పగ?
బండి సంజయ్‌ను బీఆర్ఎస్ ఇంతలా టార్గెట్ చేయడం వెనుక లోతైన రాజకీయ కోణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన పదునైన మాటలతో, పర్యటనలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టారు. ఒకానొక దశలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేంతగా ఆయన ఊపు తీసుకువచ్చారు. అయితే, ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాక బీజేపీ గ్రాఫ్ తగ్గి, కాంగ్రెస్ పుంజుకుందని, లేదంటే బీఆర్ఎస్‌కే మళ్లీ అవకాశం ఉండేదని రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చర్చ నడుస్తోంది. అప్పట్లో తనను ఇబ్బంది పెట్టిన బండికి ఇప్పుడు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.

భవిష్యత్ ఎన్నికల వ్యూహం..
ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చే ఎన్నికలకు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీలో గళం వినిపించే బలమైన నేతగా బండి సంజయ్ నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడి కేసును అడ్డం పెట్టుకుని బండి సంజయ్‌ను రాజకీయంగా దెబ్బతీస్తే, వచ్చే ఎన్నికల నాటికి తమకు ఒక పెద్ద అడ్డంకి తొలగిపోతుందనేది బీఆర్ఎస్ అంతర్గత వ్యూహం. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్తోంది. బండి సంజయ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడం ద్వారా అటు బీజేపీని, ఇటు సంజయ్‌ను రాష్ట్ర రాజకీయాల్లో బలహీనపరచడమే కారు పార్టీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ప్రజా మైలేజ్ కోసం బీఆర్ఎస్ పోరాటం
భగీరథ్ విషయంలో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలకు ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. సామాన్య ప్రజల్లో కూడా ఈ అంశం చర్చనీయాంశం కావడంతో బాధితురాలి తరఫున పోరాటం చేసే పార్టీగా మైలేజీ దక్కింది. ఏది ఏమైనా గతంలో తనను ముప్పుతిప్పలు పెట్టిన బండి సంజయ్‌కు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకూడదనే కసితో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు భగీరథ్ కేసుతో బండి సంజయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తోంది. గతంలో ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసిన బీఆర్ఎస్‌కు ఈ కేసు ఒక వరంలా మారిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *