• మెదడు సంబంధిత వ్యాధితో వ్యక్తి బాధపడుతున్న వ్యక్తి
  • సాయం చేసి ఆదుకోవాలని నిరుపేద కుటుంబం రిక్వెస్టు

వేద న్యూస్, జమ్మికుంట:

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన నారగోని శ్రీనివాస్ కుటుంబం కష్టాలతో సతమతమవుతోంది. 2021లో శ్రీనివాస్‌కు మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి సోకిందని తెలిసింది. ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు ఆపరేషన్‌కు కుటుంబ సభ్యులు ఎలాగోలా డబ్బులు సమకూర్చారు.

అప్పు చేసి మరీ ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు పేర్కొనగా సంతోషడ్డారు. కానీ, ఆపరేషన్ తర్వాత శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడటానికి బదులు, క్రమంగా క్షీణించడం మొదలైంది. శరీరంపై నియంత్రణ కోల్పోయాడు. నెమ్మదిగా, కొద్దికొద్దిగా కదల్లేకపోయాడు. చివరకు, గత రెండేండ్లుగా శ్రీనివాస్ మంచానికే పరిమితమయ్యాడు. కనీసం లేచి కూర్చోవడానికి కూడా ఆయనకు వేరొకరి సాయం కావాలి. 

ఎన్నో ఆసుపత్రులు, పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్… ఎక్కడికి వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రూ.వేలకు వేలు, లక్షలకు లక్షలు నీటిపాలయ్యాయి. వైద్య పరీక్షల కోసం, మందుల కోసం శ్రీనివాస్ కుటుంబం తమకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుంది. సొంత ఇంటి స్థలాన్ని అమ్ముకున్నారు. ఇంకా డబ్బు సరిపోకపోవడంతో, తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

శ్రీనివాస్ తల్లి కన్నీటిపర్యంతమవుతూ, “మాకు ఒక్కగానొక్క కొడుకు వాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నాం. పెద్దయ్యాక మాకు అండగా ఉంటాడని ఆశపడ్డాం. ఈ వయసులో మమ్మల్ని చూసుకుంటాడనుకుంటే, వాడే మంచానికే పరిమితమయ్యాడు. మా జీవితాలు తలకిందులయ్యాయి,” అంటూ గుండెలవిసేలా రోదిస్తోంది. శ్రీనివాస్‌కు భార్యతో పాటు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నపిల్లల భవిష్యత్తు, కుటుంబాన్ని పోషించాల్సిన భారం, వైద్య ఖర్చులు… ఈ ఆలోచనలన్నీ ఆ కుటుంబాన్ని నిరంతరం వేధిస్తున్నాయి.

సహాయం కోసం ఆరాటం

ఇప్పటికే ఆస్తులన్నీ కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం వైద్య ఖర్చులకు, మందులకు, కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేవు. వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. నిస్సహాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబం ఇప్పుడు సమాజం వైపు, దాతల వైపు, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రభుత్వం గానీ, స్థానిక నాయకులు గానీ, కనీసం దాతలు గానీ ముందుకు వచ్చి తమ కుటుంబానికి అండగా నిలిచి, తోచిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఒకప్పుడు తమ కాళ్ళ మీద తాము నిలబడిన ఆ కుటుంబం, ఇప్పుడు కనీసం ఆకలి తీర్చడానికి కూడా పరుల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ కన్నీటి గాథ విన్న ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోక మానదు. వారి ఆశలన్నీ ఇప్పుడు మన సహాయం మీదే ఆధారపడి ఉన్నాయి.

ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు నేరుగా గాని లేదా గూగుల్ పే, ఫోన్ పే నంబర్ : 9652536615 (నారగోని మౌనిక ) ద్వారా గానీ లేదా అకౌంట్ నెంబర్ :
A/C 79064250360, IFSC CODE : SBINORRDCGB, (తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జమ్మికుంట శాఖ)(నారగోని మౌనిక) ద్వారా గాని హార్దిక సహాయం అందించగలరని కోరుతున్నారు.