వేద న్యూస్, హన్మకొండ :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల రూ. 6వేలు, అలాగే అన్ని రకాల పెన్షన్లు రూ.4000 పెంచాలని జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హంటర్ రోడ్ లోని డి కన్వెన్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంగాల జిల్లా సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు గద్దెల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు హామీల మీద హామీలు ఇచ్చి తీరా అధికారంలో రాగానే వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తోందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజు నుండి వికలాంగులకు రూ.6000 అలాగే మిగితా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత,గీత బీడీ కార్మికుల పెన్షన్ 4000 పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి దానిని నిలబెట్టుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి బోగం అనుభవిస్తున్నాడే తప్ప పెన్షన్ దారుల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. పెన్షన్ లు పెంచకపోతే లక్షలాది మంది పెన్షన్ దారులు కాంగ్రెస్ కు దూరం అవుతారని అన్నారు. పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ
ఈ నెల 29 న ఉమ్మడి జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామని ప్రతి గ్రామం నుండి పెన్షన్ దారులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.