వేద న్యూస్, కమలాపూర్ :

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీకి విద్యుత్ లైట్లు లేక దారంతా చీకటి మయంగా మారింది. కాలనీవాసులు తమ తమ ఇండ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.

అసలే వర్షాకాలం కాబట్టి వర్షాలు కురవడం దారంతా చీకటిగా ఉండడం కాలినడకన ఇండ్లకు చేరుకునే కాలనీవాసులకు తమతమ ఇండ్లకు చేరుకునే వరకు బిక్కుబిక్కుమంటూ భయంతో నడుస్తున్నారు. అసలే ఇది పాములు, తేళ్లు ఎక్కువగా బయటకు వచ్చే కాలం అవడంతో కాలనీవాసులు దారి వెంట కాలినడకన నడిచే సమయంలో ఏ విషపురుగు కనబడుతుందో ఆదమరిచి వాటిపై కాలు వేస్తే అది తమని ఏ ప్రమాదానికి గురి చేస్తుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి విద్యుత్ లైట్లు అమర్చి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. అయినా గ్రామపంచాయతీ పరిధిలో ఎన్ని కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలో ఎన్ని స్తంభాలకు ఎన్ని విద్యుత్ లైట్లు ఉన్నాయి అందులో ఎన్ని వెలుగుతున్నాయి ఎన్ని వెలగట్లేదు వెలగకపోవడానికి కారణమేమిటి అనే విషయాలు సంబంధిత అధికారులు గానీ, సిబ్బంది గానీ తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన ఎందుకు చేయట్లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.