• వంట మనిషిని మార్చాలని హెచ్ఎంకు ఆదేశాలు

వేద న్యూస్ , దుగ్గొండి :

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం దుగ్గొండి మండలం కేజీబీవీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ హెల్త్ క్యాంప్ లో బ్లడ్ గ్రూప్, షుగర్ థైరాయిడ్, కళ్ళ పరీక్షలు, ఎనిమియా, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలను నిర్వహించి హెల్త్ కార్డులో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కార్డు లో వివరాలు నమోదు చేసి ఈ క్యాంపు లను తరచుగా నిర్వహించడం జరుగుతుందని, పిల్లల ఆరోగ్య పరిస్థితులను బట్టి వారికి మందులు మరియు ఆహార అందించుటకు టీచర్లు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

పరీక్షించిన అనంతరం విద్యార్థులకు కిషోర రక్ష ఆరోగ్య కార్డు లను కలెక్టర్ అందజేశారు. అనంతరం కేజీబీలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. కుళ్లిన కూరగాయలను చూసి జిల్లా కలెక్టర్ వంట మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. వారిని మార్చాల్సిందిగా హెడ్మాస్టర్ కు సూచించారు.

స్టోర్,కిచెన్ రూమ్ ను పరిశీలించి శుభ్రంగా ఉండేలా తరచూ క్లీన్ చేయాలని, ఈగలు దోమలు రాకుండా పెనాయిల్ వేసి శుభ్రం చేయాలని, వర్షాకాలం శుభ్రత పాటించాలని లేదంటే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

పిల్లలతో కలిసి భోజనం చేసి పిల్లలకు ఎక్కువ ఉప్పు, కారం పులుపు తగ్గించాలని సూచించారు. కస్తూరిబా స్కూల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ ను పరిశీలించి అందులో స్లీపింగ్ బెడ్స్ గురించి ఇద్దరు విద్యార్థులు కంప్లైంట్ బాక్స్ లో వేయడం జరిగిందని అందుకు తగిన ఏర్పాట్లు చేయుటకు ప్రయత్నం చేస్తానని జిల్లా కలెక్టర్ అన్నారు.

అనంతరం కస్తూరిబా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా సూచిస్తూ జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈవో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ సాంబశివరావు, తాసిల్దార్ రాజేశ్వర్ రావు, కేజీబీవీ హై స్కూల్ హెడ్మాస్టర్ మంజుల ఎంపీడీవో అరుంధతి, డాక్టర్స్, నర్సులు, ఎఎన్ఎమ్స్ లు తదితరులు పాల్గొన్నారు.