వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు రెస్టారెంట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులు, డైరెక్టర్ ఐపిఎం డాక్టర్ సి శివలీల ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పి. రోహిత్ రెడ్డి , శ్రీషిక ,పి.స్వాతి,వి.అంకిత్ రెడ్డి లతో కూడిన బృందం వేములవాడ మండల కేంద్రంలో గల తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

  పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారు చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం,పెస్ట్ కంట్రోల్ పాటించకపోవడం, అపరిశుభ్రంగా ఉన్న రిఫ్రిజిరేటర్లలో నిలువ చేసిన దుర్వాసనతో కూడిన మాంసపు ఉత్పత్తులను భారీ మొత్తంలో గుర్తించడం, అలాగే ఎగ్జాస్టర్ ఫాన్స్ పై నూనెతో కూడిన  నూనె దుమ్ము ధూళితో పేరుకుపోవడం, ఫుడ్ హ్యాండ్లర్స్ హెయిర్ క్యాప్ మరియు హ్యాండ్ గ్లోవ్స్ ధరించకపోవడమ్,అపరిశుభ్ర ప్రాంతంలో మూతలు తీసిన దుమ్ము ధూళి ఈగలతో కూడిన వండిన ఆహార పదార్థాలను, కుళ్లిన ఉడికిన గుడ్లు హానికర రసాయనాలతో కూడినటువంటి కృత్రిమ రంగులను బిరియాని మరియు ఇతర ఆహార తయారీకి ఉపయోగించడం గుర్తించారు.

రెస్టారెంట్ లో రూ. 20 వేల 500 విలువ గల సుమారు 70 కిలోల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన టీ పౌడర్ మరియు ఇతర ముడి సరుకులు, లేబుల్ డిఫెన్స్ కలిగిన కాజు, మసాలా పొడులు, మిగిలి ఉంచిన బిర్యాని, ఇతర ఆహార పదార్థాలను ప్రజల ఆరోగ్య నిమిత్తం హోటల్ యాజమాన్యాన్ని ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ హెడ్ వి.జ్యోతిర్మయి హెచ్చరించి.. అక్కడికక్కడే ధ్వంసం చేశారు. 

 

 ఎఫ్ఎస్ఎస్ 2006 చట్టం ఉల్లంఘించినందుకు వారికి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా మునిసిపల్ అధికారుల సమన్వయంతో హోటల్ నందు పూర్తిగా అపరిశుభ్ర వాతావరణ ఉన్నందున, ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 మున్సిపల్ చట్టం 2019 ని ఉల్లంఘించినందుకు గాను వేములవాడ మున్సిపల్ అధికారులచే రూ.30 వేల జరిమానా విధించి రెస్టారెంట్ ను తదుపరి రెక్టిఫికేషన్ చర్యల నిమిత్తం తాత్కాలికంగా మూసి వేయించారు.

 

అదేవిధంగా,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల రుచి హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్ హ్యాండ్లర్స్,గ్లౌజ్ మరియు హెయిర్ క్యాప్స్ ధరించకపోవడం, పండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, ఈగలతో కూడిన ఆహారం ఉండడం, మూతలతో కూడిన డస్ట్ బిన్స్ వాడకపోవడం, పెస్ట్ కంట్రోల్ లేకపోవడం, స్టోర్ రూమ్ లో వంటకుఉపయోగించేటువంటి నాణ్యతలేని ముడి సరుకులు ఉండడం, కుళ్లిన ఫంగల్ ఇన్ఫెస్తేడ్ కాలిఫ్లవర్ క్యారెట్ మరియు ఇతర కూరగాయలు ఆహార తయారీకి ఉపయోగించడం, కాలం చెల్లిన ముడి సరుకులు, హోటల్ యాజమాన్యం కలిగి ఉండాల్సిన తగిన రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం తో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం 2006 ఉల్లంఘించినందుకు , వారికి నోటీసులు జారీ చేశారు. 

అనుమానిత ఆహార పదార్థాల శాంపులను సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్ లో గల ల్యాబ్ కు పంపించారు. అదేవిధంగా రూ. వెయ్యి విలువగల 5 కిలోల పురుగులతో కూడిన మైదాపిండి, కుళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ముడి సరుకులను ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేశారు. 

నిబంధనలు పాటించని, ప్రభుత్వ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్  వి. జ్యోతిర్మయి , టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించారు.

అలాగే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.