• ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ప్రభాకర్ హామీ 
  • ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజల బ్రహ్మరథం
  • కేసీఆర్ హుస్నాబాద్ ధనం సిద్దిపేటకు పట్టుకెళ్లారని విమర్శ

వేద న్యూస్, ఎల్కతుర్తి:
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్, కేశవపూర్, బావుపేట గ్రామలలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో పొన్నం మాట్లాడుతూ గతంలో తనను ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా పని చేశానో అందరికీ తెలుసని చెప్పారు.


రేపు మళ్లీ తనను గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. తాను ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి చేశామని వివరించారు. ఇక్కడ ‘డబుల్’ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తే తనకు ఓటు వేయొద్దని, లేదంటే ఆ పార్టీకి ఓటు వేయవద్దని కోరుతున్నానని ప్రభాకర్ తెలిపారు.

హుస్నాబాద్ ధనం అంత సిద్దిపేటకు పట్టుకు పోయింది కేసీఆర్ ప్రభుత్వమని విమర్శించారు. కొత్త పింఛన్లు లేవు, రేషన్ కార్డు లేవని వెల్లడించారు. కానీ పక్క గ్రామంలో ఉప ఎన్నిక ఉన్నద కాబట్టి అక్కడ ‘దళిత బంధు’ ఇచ్చారని, కానీ, ఇక్కడ ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ‌ల పేపర్ బాండ్ పేపర్ మాదిరిగా భద్రపరచి అధికారంలోకి వచ్చాక అడగాలని ప్రజలను కోరారు.

కేశవాపురం గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని, ఆరు గ్యారంటీలు ముందు ఉంచి వస్తున్న తనను ఆదరించి..ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రూ.3 వేల కోట్ల ప్రజా ధనం వృథా అయిందని కాకతీయ యునివర్సిటీ ప్రొఫెసర్ వీరన్న నాయక్ ఆవేదన వ్యక్తం చేశారని పొన్నం ప్రభాకర్ వివరించారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు ఇంద్రాసేనారెడ్డి ఎలిగేటి, మాజీ మండల అధ్యక్షులు సుకినె సంతాజీ, యూత్ కాంగ్రెస్ నాయకులు హింగె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.