= తెలంగాణలో ‘పవన్’ ఎంట్రీతో సర్వత్రా అలర్ట్
= ఎన్నికల బరిలోకి నిలుస్తామంటూ అధికారికంగా ప్రకటన
= జనసేనాని ప్రకటనతో మారిన సమీకరణాలు
= రాష్ట్రంలో పవన్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం
= మిగతా పార్టీల్లోనూ మొదలైన అలజడి
= మాటల వాడి పెంచుతున్న హస్తం పార్టీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్
= పవన్ ఎంట్రీ వెనుక బీజేపీ హస్తం అంటూ ప్రచారం
= కాంగ్రెస్ మాటలను తిప్పికొడుతున్న జనసేన సైన్యం
= సరికొత్త వ్యూహాలతో కదులుతున్న రాజకీయం

వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయంతో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తెలంగాణపై పంజా విసరడానికి సిద్ధమవడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం రాజుకుంది. తెలంగాణలో జనసేన కచ్చితంగా ఎంట్రీ ఇస్తుందని, రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో.. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతున్న రాష్ట్ర రాజకీయం.. పవన్ రాకతో సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది.

‘తెలంగాణ మీ అయ్య జాగీరా?!’ అంటూ పవన్ ఆగ్రహం!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన శ్రేణులతో భారీ సభ నిర్వహించేందుకు పవన్ ప్లాన్ చేయగా.. శాంతిభద్రతల సాకుతో పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించారు. ఈ పరిణామంపై పవన్ మీడియా సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?!’ అంటూ నిలదీశారు. తెలంగాణ తనకు ఎంతో ఆత్మీయమైన నేలని, ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇకపై తానే స్వయంగా తెలంగాణ అంతటా తిరుగుతానని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన జెండా ఎగరేయడమే లక్ష్య్ంగా బరిలోకి దిగుతామని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ‘పవన్ వర్సెస్ కాంగ్రెస్’ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది.

పెరిగిన జనసేన, కాంగ్రెస్ మాటల వేడి!
మరోవైపు పవన్ కల్యాణ్ ఎంట్రీని కాంగ్రెస్ పార్టీ, స్థానిక తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణ మట్టిపై పవన్ సభలు పెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి పెంచగా.. జనసైనికులు సైతం అంతే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై భగ్గుమంటున్నారు. అయితే తాను ఎన్నడూ తెలంగాణను వ్యతిరేకించలేదని, కేవలం పార్లమెంట్‌లో విభజన జరిగిన తీరును మాత్రమే తప్పుపట్టానని పవన్ గట్టిగా సమర్థించుకుంటున్నారు.

అన్ని పార్టీలు అలర్ట్
రాష్ట్రంలో ఎన్నికల సమరానికి ఇప్పటికే సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన లాంటి పార్టీలకు పవన్ కళ్యాణ్ రూపంలో సరికొత్త సవాలు ఎదురైంది. మొన్నటివరకు కవిత పార్టీతో పరిణామాలు మారుతాయని భావించిన తరుణంలో.. ఇప్పుడు పవన్ నేరుగా క్షేత్రస్థాయిలోకి వస్తుండటంతో ఓట్ల చీలికపై అన్ని పార్టీల్లోనూ గుబులు మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లోనూ జనసేనకు ఉన్న బలమైన యువ ఓటు బ్యాంక్, సెటిలర్ల మద్దతు ఏ పార్టీ కొంప ముంచుతుందోనని ప్రధాన పార్టీల అధినేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

బీజేపీ ప్లాన్ అంటూ..
పవన్ కల్యాణ్ తెలంగాణ ఎంట్రీ వెనుక మిత్రపక్షమైన బీజేపీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం ద్వారా తెలంగాణలో లాభపడాలనేది కమలదళం వ్యూహంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే పవన్ తెలంగాణపై ఫోకస్ చేయడాన్ని బీజేపీ నేతలు ఎక్కడా నెగెటివ్‌గా కామెంట్ చేయడం లేదు. ఇరు పార్టీల మధ్య మిత్రధర్మాన్ని కొనసాగిస్తూనే వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగి.. అవసరమైతే ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, జనసేనాని, బీజేపీ పార్టీల ఫోకస్‌తో తెలంగాణ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *