= భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
= పంట సాగులో పెరుగుతున్న డ్రోన్ల జోరు
= శ్రమ, సమయం ఆదా చేస్తూ రైతన్నకు కొండంత అండ
= మందు పిచికారీ నుంచి పంట పర్యవేక్షణ వరకు..
= కార్మికుల కొరతకు ప్రత్యామ్నాయంగా సరికొత్త విధానం
= కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం.. సబ్సిడీలపై డ్రోన్ల పంపిణీ
= గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తున్న ‘డ్రోన్ దీదీ’
= గంటల పని నిమిషాల్లోనే పూర్తి..
= రసాయనాల వృథాకు చెక్

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి:
భారత వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కేవలం సినిమా షూటింగుల్లో, నగరాల వేడుకల్లో మాత్రమే కనిపించిన డ్రోన్లు.. ఇప్పుడు పల్లెటూళ్లలోని రైతుల పొలాల్లో రెక్కలు విప్పుకుని ఎగురుతున్నాయి. పంటలపై మందు పిచికారీ చేయడం, ఎరువుల పంపిణీ, పంట ఆరోగ్య పరిశీలన, నీటి వినియోగ అంచనా వంటి పనుల్లో డ్రోన్ల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ ఆధునిక సాంకేతికత వల్ల రైతులకు శ్రమ, సమయం కలిసిరావడంతో పాటు సాగు ఖర్చులు కూడా భారీగా తగ్గుతుండటంతో వ్యవసాయం కొత్త దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కార్మికుల కొరతకు చెక్..
ప్రస్తుత రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల కొరత పీక్ స్టేజ్‌కు చేరింది. ఇలాంటి క్లిష్ట సమయంలో డ్రోన్ల ఎంట్రీ రైతాంగానికి పెద్ద ఉపశమనంగా మారింది. ఈ సాంకేతికతను మరింతగా జనం తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ సంస్థలకు సబ్సిడీలు ఇస్తూ డ్రోన్ల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్‌ దీదీలు పేరుతో గ్రామీణ మహిళలకు ప్రత్యేకంగా డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చి, వారిని ఈ సేవలలో భాగస్వామ్యం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేస్తూ మహిళలు సైతం గ్రామాల లోనే గౌరవప్రదమైన ఉపాధిని, అదనపు ఆదాయాన్ని పొందుతుండటం విశేషం.

గంటల పని నిమిషాల్లోనే..
వ్యవసాయంలో డ్రోన్ల వల్ల రైతులకు ప్రత్యక్షంగా అనేక ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఒకప్పుడు గంటల సమయం పట్టే మందు పిచికారీ పనిని.. ఇప్పుడు డ్రోన్ల సహాయంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. పైనుంచి స్ప్రే చేయడం వల్ల మందులు మొక్క అంతటా సమానంగా పడి కీటకాల నివారణ సమర్థవంతంగా జరుగుతుంది, రసాయనాల వృథా కూడా తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, రైతులు లేదా కూలీలు నేరుగా విషపూరిత రసాయనాల మధ్య ఉండి పిచికారీ చేయాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల శ్వాసకోశ, చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు పూర్తిగా తగ్గిందని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు.

యాప్ ద్వారా బుకింగ్..
సాంకేతికత ఎంతగా అప్‌గ్రేడ్ అయిందంటే.. డ్రోన్లకు అమర్చే ప్రత్యేక హై రిజల్యూషన్ కెమెరాల సహాయంతో పంటలకు ఎక్కడ నీటి ఎద్దడి ఉందో, ఎక్కడ తెగుళ్లు ప్రారంభమవుతున్నాయో ముందే గుర్తించే వీలు కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ స్మార్ట్‌ఫోన్లలోని మొబైల్‌ యాప్‌ల ద్వారా నేరుగా డ్రోన్‌ సేవలను బుక్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మనం సిటీల్లో క్యాబ్ బుక్ చేసుకున్న చందంగానే.. పొలం ఉన్న లొకేషన్‌కు డ్రోన్లు వచ్చి సేవలందిస్తున్నాయి. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా తక్కువ ఖర్చుతో ఆధునిక వ్యవసాయాన్ని అలవర్చుకుంటున్నారు.

పరిష్కరించాల్సిన సవాళ్లు..
వ్యవసాయంలో డ్రోన్ల వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని సవాళ్లు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. మార్కెట్‌లో డ్రోన్ల ధరలు సామాన్య రైతులకు అందుబాటులో లేనంత ఎక్కువగా ఉండటం, సాంకేతిక పరిజ్ఞానంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉండటం, బ్యాటరీ లైఫ్ పరిమితులు మరియు నిరంతర సాంకేతిక శిక్షణ అవసరం కావడం వంటివి ఇంకా సవాలుగానే మిగిలాయి. ఏది ఏమైనప్పటికీ, శ్రమను తగ్గించి, ఖర్చును నియంత్రిస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా డ్రోన్ల టెక్నాలజీ భారత రైతాంగానికి ఒక కొత్త దారిని చూపిస్తోంది. ప్రభుత్వాలు మరిన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రతి పల్లెకూ వీటిని చేరిస్తే, భవిష్యత్తులో ప్రతి పొలంలోనూ డ్రోన్ల సవ్వడి ఒక సాధారణ దృశ్యంగా మారడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *