- రాష్ట్రంలో రాబోయేది హస్తం పార్టీ సర్కారేనని రాజేందర్ రెడ్డి ధీమా
- కాజీపేటను అభివృద్ధికి దూరం చేసిన స్థానిక ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని పిలుపు
వేద న్యూస్, హన్మకొండ:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట 62, 63వ డివిజన్ల నుంచి బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం వారందరికీ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ కార్పొరేటర్ గుంటి కుమారస్వామి, ఆయన అనుచరులు, నాయకులు తదితరులు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ కాజీపేట పట్టణాన్ని అభివృద్ధికి దూరం చేసిన స్థానిక ఎమ్మెల్యేకు ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాజీపేట బస్టాండ్ వేదికగా ఉద్యమం చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి బస్టాండ్‌ను విస్మరించారని, రైల్వే పరిశ్రమల పట్ల నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. కాజీపేట పట్టణ అభివృద్ధిని నీరుగార్చాడని, నాలుగు పర్యాయాలు కాజీపేట ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే..కాజీపేటకు మొండి చెయ్యే చూపించాడని విమర్శించారు.

ఈ ఎన్నికలలో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునే పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ..కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు 37 సంవత్సరాల అనంతరం అవకాశం వచ్చిందని, పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగిన తనకు సహకరించాలని కోరారు. కాజీపేట అభివృద్ధిని మనమందరం కలిసికట్టుగా చేసుకుందామని నాయిని హామీనిచ్చారు.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే నేటికీ కనపడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమే అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు, మహిళలు, అందరికీ శుభాభివందనాలు తెలుపుతూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ..స్వాగతించారు. కార్యక్రమంలో సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ గయాసుద్దీన్, సయ్యద్ రిజ్వాన్, లల్లు, శ్రావణ్, శ్రీకాంత్ రావు, ఎం రమేష్, ఆర్ వెంకట్, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, జిల్లా అధికార ప్రతినిధి మహమ్మద్ అంకూస్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.