- పొంచిన ప్రమాదం కనీస రక్షణ చర్యలు లేవు
- మండల కేంద్రంలోని ఓ ప్రధాన బ్యాంకు ఎదుట ఇదీ పరిస్థితి
- కంచె లేకుండానే ట్రాన్స్ ఫార్మర్..
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
అది మండల కేంద్రం.. అందులో ప్రభుత్వ రంగ బ్యాంకు.. నిత్యం మండల పరిధిలోని ప్రజలు, బ్యాంకు కస్టమర్లు వచ్చే ప్రదేశం.. అటువంటి చోట కనీస రక్షణ చర్యలు లేకుండానే ట్రాన్స్ ఫార్మర్ ఉంది.

ప్రస్తుత వానాకాలం సీజన్ లో భారీ వర్షాలు, వరద, ఉరుములు, మెరుపులు.. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అయినా అదేమీ పట్టింపు లేకుండానే వ్యవహరిస్తున్నట్టు అక్కడ పరిస్థితి చూస్తేనే స్పష్టమవుతుంది. రోడ్డుకు పక్కనే జనసంచారం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కంచె లేని ట్రాన్స్ ఫార్మర్ కు వాహనాలు అదుపు తప్పి తగిలితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలుంటాయి. అయినా తమకేమీ పట్టలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వీణవంక మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ రంగ (పీ ఎస్ యూ) బ్యాంకు ఎదుట ట్రాన్స్ ఫార్మర్.. కనీస రక్షణ చర్యలు లేకుండానే కొనసాగుతోంది. అటుగా వెళ్ళే ప్రజలకు, బ్యాంకు కస్టమర్లకు సదరు ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టేనని పలువురు హెచ్చరిస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ వారు స్పందించాలని, ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదం జరిగితేనే స్పందించాలనే తీరు సరికాదని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే అందరికీ మంచిదని సూచిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ గ్రిల్స్ ఉండాలని, తద్వారా అందరికీ సురక్షితంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
