• కరెంటు తీగలు తొలగించడాన్ని విద్యుత్ శాఖ వారు పట్టించుకోవడం లేదు
  • బాధితురాలి ఆరోపణ..  

వేద న్యూస్, మెట్‌పల్లి: 

ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలను తొలగించడంలో విద్యుత్ శాఖ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో కదలిక లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి స్థలంపైన ఉన్న సదరు కరెంటు తీగల వల్ల ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే సమయంలో మేస్త్రికి షాక్ తగిలి.. ఇల్లు పని ఆగిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యం వల్ల తమ సొంతింటి కల నెరవేరడం లేదని చెబుతున్నారు. 

తాను గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలను తొలగించాలని విద్యుత్ శాఖను కోరుతున్నానని మెట్‌పల్లి‌లోని  సింగపూర్ 2వార్డుకు చెందిన జెల్ల భాగ్య తెలిపారు. ఈ విషయమై అధికారులకు మొర పెట్టుకున్నానని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు కేవలం అక్కడికి వచ్చి చూసి వెళ్లడం మాత్రమే చేస్తున్నారని, చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు.

ఈ విషయమై తాను గత నెల 18న  ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించానని, కరెంటు తీగాలు తొలగించాలని కోరానని చెప్పారు. కరెంటు తీగలు తొలగించకపోవడం వల్ల తనకు ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకం కింద  వచ్చిన ఇల్లు కట్టుకోలేక పోతున్నానని వివరించానని స్పష్టం చేశారు. 

అనంతర కాలంలో విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు అలా వచ్చి చూసెళ్లారని చెప్పారు. తాము  ఇల్లు పని చేస్తూ ఉండగా, మేస్త్రికి కరెంట్ షాక్ తగిలి గాయలాపాలు అయ్యారని వెల్లడించారు.   ఇల్లు కట్టుకోవాలన్న తమ కల కలగానే మిగిలిపోతున్నదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.