- బీజేపీ జమ్మికుంట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాటాలు
- ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీకి నిధులు మంజూరు
- నేను పెట్టిన పోస్టు పూర్తిగా చదవకుండా కాంగ్రెస్ నేతలు స్పందించారు
- తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
- బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు
వేద న్యూస్, జమ్మికుంట:
ప్రజా సమస్యలు గుర్తించి పోరాటాల ద్వారా ప్రభుత్వానికి తెలపడానికే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉన్నది నిధులు కేటాయించి అభివృద్ధి చేయడానికేనని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి రవిందర్ పత్రికా ప్రకటనలో.. ‘కొలకాని రాజు నిధులు నేనే తెచ్చా అని చెప్పుకుంటూ’ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారని తప్పుడు ఆరోపణలు చేశారని, దానిని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ నేతల ప్రకటనకు కొలకాని రాజు ఆదివారం కౌంటర్ ఇచ్చారు.
తాము బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని, వాటికి స్పందన లేకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, నిరసన ర్యాలీలు నిర్వహించామని చెప్పారు. వాటికి మున్సిపల్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారని, తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు.
నిధులు మంజూరు అయిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు అని ‘రామన్నపల్లె మిత్రమా’ అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తే.. దానిని పూర్తిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించారు. చదువు రాకపోతే ఎవరితో అయినా చదివించుకుని స్పందించాలని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి ఆకుల రాజేందర్, రాజేష్ ఠాకుర్, కైలాసకొటి గణేష్, బచ్చు శివన్న, అప్పాల రవిందర్, చందా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
