= లక్షల్లో జీతం.. లక్షలకు లక్షలు లంచం.. కోట్లలో ఆస్తులు
= బయటపడుతున్న అవినీతి తిమింగలాల విశ్వరూపం
= తెలంగాణలో బట్టబయలవుతున్న లంచగొండుల దందా
= వందల కోట్ల ఆస్తులు.. వందల ఎకరాలు భూములు
= పంచాయతీ కార్యదర్శి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు..
= వేల కోట్ల భూములు ప్రైవేట్ పరం చేసిన డిప్యూటీ కలెక్టర్
= జలమండలి జీఎం ఇంట్లో వంద కోట్ల అక్రమాస్తులు
= ఏసీబీ కేసుల్లో 40 శాతం పోలీసులే..
= మేమేం తక్కువ కాదంటున్న మహిళా అధికారిణులు

వేద న్యూస్, క్రైం బ్యూరో:
లక్షల్లో జీతం, హోదాకు తగిన ప్రభుత్వ వసతులు, సమాజంలో ఎనలేని గౌరవం.. ఇవన్నీ ఉన్నా కొందరు అధికారుల నోట్ల మత్తు మాత్రం వదలడం లేదు. తమ ఉన్నత హోదాను కుదవబెట్టి, అడ్డదారుల్లో డబ్బులను కూడబెడుతూ కోట్లు గడిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎప్పుడు, ఎక్కడ రైడ్లు చేసినా.. పట్టుబడుతున్న కోట్ల కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి, వందల ఎకరాల భూములు, లగ్జరీ ప్లాట్ల దస్తావేజులు చూసి సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒక జిల్లా స్థాయి అధికారి ఏసీబీకి చిక్కాడంటే చాలు.. ఓపెన్ మార్కెట్‌లో ఆయన ఆస్తి విలువ కనీసం రూ.100 కోట్లు ఉంటోందనేది నగ్న సత్యం. కేవలం అధికారం ఇచ్చిన వెసులుబాటును సొమ్ముగా మలుచుకుంటూ, ఏకంగా సర్కారు భూములను సైతం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ, అందులో భారీగా వాటాలు లాగేస్తున్నారు.

రెవెన్యూలో ఇష్టారాజ్యం..
తెలంగాణలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగలాల ఆగడాలు పరాకష్టకు చేరాయి. ప్రజల భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తహశీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకులకు ఇచ్చిన విచక్షణ అధికారాలను కొందరు కోట్లు గడించేందుకు వాడుకుంటున్నారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అవినీతి లీలలు చూసి స్వయంగా ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. ఈయన తాను పనిచేసిన శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్మేట్ మండలాల్లో వందల ఎకరాల వివాదాస్పద ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. అబ్దుల్లాపూర్మేట్‌లో ఉన్నప్పుడు పిగిలిపూర్ గ్రామంలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏకంగా తన సొంత మామ పేరిట బదలాయించి, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇచ్చి ప్లాట్లు పొందారంటే ఈయన బరితెగింపు అర్థం చేసుకోవచ్చు. అలాగే శేరిలింగంపల్లిలో ఐదేళ్లు పనిచేసిన కాలంలో గోపన్‌పల్లి పరిధిలో ఏకంగా 192 ఎకరాల వేల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ పరం చేసినట్లు విచారణలో వెలుగుచూసింది.

జలమండలి జీఎం ఇంట్లో వంద కోట్ల సామ్రాజ్యం
హైదరాబాద్ జలమండలి ప్రాజెక్టు డివిజన్-3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్ ఇల్లు, అతడి బంధువులు, స్నేహితులకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఏకకాల సోదాల్లో అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ పరిధుల్లో రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.5.88 కోట్లుగా రికార్డుల్లో చూపించినప్పటికీ.. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల్లో భారీగా దొరికిన రూ.500 నోట్ల కట్టలు, కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు మరియు విలువైన ప్లాట్ల దస్తావేజులను చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

పోలీస్ శాఖలోనూ ‘మా వాటా’ తగ్గదేలే..
పోలీస్ శాఖ సైతం అవినీతి కేసుల్లో ముందంజలో ఉండటం గమనార్హం. ఏసీబీ పట్టుకుంటున్న మొత్తం కేసుల్లో కనీసం 40 శాతం మంది పోలీసులే ఉంటున్నారంటే ఆ శాఖలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఖాకీ అధికారులు తమ పోస్టింగుల కోసం లక్షల రూపాయల లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోందని, ఆ పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయడానికే తాము లంచాలు తీసుకుంటున్నామనే వింత వాదనను తెరపైకి తెస్తున్నారు. తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కలకలం రేపుతూ.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ ఏసీబీ ఉచ్చులో చిక్కారు. ఆయన ఏకంగా రూ.9 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.5 లక్షల నగదును నేరుగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారు.

మేమూ తక్కువేం కాదంటున్న మహిళలు
సాధారణంగా మహిళా అధికారులలో అవినీతి తక్కువనే భావన ఉండేది. కానీ, ఇటీవల కాలంలో తామేమీ తక్కువ కాదన్నట్లుగా మహిళా అధికారులు సైతం భారీగా నోట్ల కట్టలతో ఏసీబీకి దొరుకుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా షామీర్‌పేట మండల తహశీల్దార్ సుచరిత అలియాబాద్ గ్రామ పరిధిలోని 30 ఎకరాల భూమి మార్పిడి కొరకు ఏకంగా రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసింది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తహశీల్దార్ కార్యాలయంలో ఆమె డ్రైవర్ ద్వారా రూ.2 లక్షల ముందస్తు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో ఎమ్మార్వో సుచరితతో పాటు కీసర రాజేష్ అనే మరో అధికారిని, సిబ్బందిని ఏసీబీ విచారిస్తోంది.

పట్టుబడినా మారని నైజం!
అవినీతి అధికారులు వరుసగా పట్టుబడుతున్నా, జైళ్లకు వెళ్తున్నా లంచగొండుల నైజంలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి నిర్మూలనకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అధికారులు లంచాలు తీసుకోవడానికి సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూనే ఉన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్, ఫారెస్ట్, పంచాయతీ రాజ్, విద్యుత్, ట్రాన్స్‌పోర్ట్, మైనింగ్, సాగునీరు, రోడ్లు భవనాలు.. ఇలా ఒకటేమిటి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అనేది ఒక నిరంతర ఆనవాయితీగా సాగుతోంది.

రూ.60 లక్షల నగదు.. రెండున్నర కిలోల బంగారం!


ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సోదాల సందర్భంగా మోహన్ నాయక్ నివాసంలో రూ.60 లక్షల నగదు, సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నగదు, బంగారంతో పాటు పలు కీలక ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, ప్లాట్లు, విలాసవంతమైన విల్లాలు, అపార్ట్‌మెంట్లను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అదనంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే ఆస్తులు, ఖాళీ స్థలాలు కూడా ఉన్నట్లు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములు, ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు కుటుంబ సభ్యులు లేదా అనుబంధ వ్యక్తుల పేర్లపై ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆస్తుల విలువ, కొనుగోలు వివరాలు, ఆదాయ వనరులు, రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గుర్తించిన ఆస్తులు తెలిసిన ఆదాయానికి మించి ఉన్నాయా అనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలను విశ్లేషిస్తూ తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *