= త్వరలో రేవంత్ కేబినెట్ విస్తరణ?
= హైకమాండ్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్
= రెండు మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ
= రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటాపోటీగా నేతలు
= బీసీ, ఎస్టీ సమీకరణాల కోటాలో గట్టి లాబీయింగ్
= అందరి దృష్టి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపైనే..
= అన్నను తప్పించి తమ్ముడికి ఇస్తారంటూ ప్రచారం
= మంత్రి పదవి ఇవ్వకంటే రాజీనామా చేస్తానంటున్న మల్‌రెడ్డి రంగారెడ్డి
= ఇద్దరు సీనియర్ మంత్రులపైనా వేటు వేసే యోచన?
= తన ఆధిపత్యానికి అడ్డు లేకుండా సీఎం స్కెచ్

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. కేబినెట్ విస్తరణకు ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పక్కా సమాచారం అందుతోంది. జూన్ మొదటి లేదా రెండో వారంలోనే ఈ కేబినెట్ విస్తరణ ఉంటుందన్న లీకులతో గాంధీ భవన్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఖాళీగా ఉన్నవి కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే. కానీ, ఆ రెండు కుర్చీల కోసం ఏకంగా 12 మంది సీనియర్ లీడర్లు పోటాపోటీగా రంగంలోకి దిగడం కాంగ్రెస్ మార్క్ అంతర్గత పోరును తలపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆశావహుల పైరవీలు, లీడర్ల లాబీయింగ్‌లు అమిత్ శైలికి చేరాయి.

ఎవరికి కలిసొచ్చేనో?
ఈసారి భర్తీ చేయబోయే రెండు మంత్రి పదవులలో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి గట్టి పోటీ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు తమ సీనియారిటీ, నిబద్ధతను చూపుతూ ఢిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు బీసీ, ఎస్టీ సమీకరణాల కోటాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్‌ పట్టుబడుతున్నారు. వీరికి తోడు పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ విజయశాంతి సైతం కేబినెట్ బెర్త్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల వివాదంతో విసిగిపోయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం ఈ రేసును మరింత రసవత్తరంగా మార్చింది. కాగా, తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఇప్పటికే ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తన అంతరంగాన్ని బయట్టడం గమనార్హం

అందరి దృష్టి రాజగోపాల్ రెడ్డి పైనే..
ఈ మొత్తం మంత్రివర్గ విస్తరణ పొలిటికల్ స్క్రీన్‌ప్లేలో అందరి ఫోకస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనే కేంద్రీకృతమైంది. ఎన్నికల నాటి నుంచే తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.. ఒకవేళ సామాజిక, ప్రాంతీయ సమీకరణాల పేరుతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే ఆయన తదుపరి అడుగు ఏంటనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గం నుండి తప్పించి.. ఆ స్థానంలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారనే సరికొత్త గుసగుసలు గాంధీ భవన్‌లో వినిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు సాధ్యం కాదు అనే కాంగ్రెస్ రూల్ ప్రకారం అన్నను దించి తమ్ముడిని ఎక్కిస్తారనే లీకులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇద్దరు మంత్రులపై వేటు తప్పదా?
కేవలం ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేయడమే కాకుండా.. ఈసారి కేబినెట్ నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులను పూర్తిగా తొలగించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఇన్‌సైడ్ పాలిటిక్స్ చెబుతున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొందరు సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరించలేక, ఆయన చెప్పిన మాట వినకుండా తమ సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారనే అసంతృప్తి ముఖ్యమంత్రి వర్గంలో ఉంది. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాల అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయని రేవంత్ భావిస్తున్నారు. అందుకే, పనితీరు సరిగ్గా లేని మరియు పార్టీ లైన్ దాటుతున్న ఆ ఇద్దరు మంత్రులను కేబినెట్ నుండి శాశ్వతంగా తప్పిస్తే.. ఇక ప్రభుత్వంలో తన పూర్తి ఆధిపత్యానికి, సింగిల్ లీడర్‌షిప్‌నకు ఎలాంటి అడ్డు ఉండదనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *