- ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
వేద న్యూస్, గంగాధర:
తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో తెలుగు ప్రవాసితులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రాంతీయ వలసవాదులు, ఇతర ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంప్రదాయాల పట్ల ప్రేమను చాటారు. మహిళలు రంగురంగుల చీరెలతో, పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఆస్ట్రేలియాలో తెలంగాణ సంస్కృతి పరిమళించిన మధుర స్మృతిగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..“విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలను మరవకుండా ఈ స్థాయిలో జరుపుకోవడం గర్వకారణం. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం తెలంగాణకు గౌరవంగా నిలుస్తోంది,” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగలకు పెద్దపీట వేస్తోందని, బతుకమ్మ వంటి పండుగల నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ అనేది ప్రాచీన సంస్కృతికి కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి ప్రాంతం నుంచి ఉద్భవించిన బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అభిమానం కలిగించే విషయం,” అన్నారు.
ఈ వేడుకలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఈ సంబరాల్లో
అధ్యక్షుడు నరేందర్ కుమార్ చొల్లూరి, ఉపాధ్యక్షుడు మాధవ రెడ్డి గుర్రం, కార్యదర్శి దయాకర్ బచ్చు, సభ్యులు ఉమేశ్ వంగపల్లి, సంతోష్ రావు ఏకే, విజయ నల్ల, శ్రీకళా రూపిరెడ్డి, ప్రియాంక కర్క, విజయ్ కోరబోయిన, ప్రేమలత వాసాల, విరించి రెడ్డి ఎక్కంటి, హరిత తన్నీరు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు.