- ఆ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి
- భారీ జన సందోహం మధ్య దాసరి నామినేషన్
- గులాబీ జెండా పేదలకు అండని వ్యాఖ్య
వేద న్యూస్, ఎలిగేడు:
ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు స్వగృహం నుంచి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు స్వప్రయోజనం కోసం పనిచేసే అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు.
గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసీఆర్..కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. ‘‘రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు’’ ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందని వెల్లడించారు.

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెల రూ.3 వేలు అందిస్తామని, రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను రూ.5వేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని వివరించారు.
తెల్ల రేషన్ కార్డు గల ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజల చేతిలో భంగపాటు తప్పదని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
