వేద న్యూస్, నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమంగా చెట్ల నరికివేతలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించామని, 8 పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓలు తెలిపాయి. వారు సంయుక్త వేదికగా ఫారెస్ట్ భూముల ఆక్రమణను తీవ్రంగా ఖండిస్తూ, పత్రికా సమావేశం బుధవారం ఏర్పాటు చేసినట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కొల్లాపూర్ మండలంలోని మల్లేశ్వరం గ్రామం, ములచింతలపల్లి గ్రామం, మరియు జిల్లావాయిపల్లి గ్రామం/వాయిలపాడుకుల గ్రామం పరిసర ప్రాంతాలలో అటవీ సంరక్షణ హక్కులు ( రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఇన్ ఫారెస్ట్ రైట్స్) పేరుతో అటవీ భూమి ఆక్రమణలు, అక్రమ చెట్ల నరికివేతలు, ఆర్వోఎఫ్ఆర్లో అవకతవకలు, అటవీ సిబ్బందిపై దాడులు మరియు బెదిరింపులు జరుగుతున్నట్లు ఎన్జీఓలు గట్టి ఆధారాలను సేకరించాయి.
ఈ ఆక్రమణల వెనుక కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, వారు డబ్బు కోసం అడవిని పాడుచేస్తున్నారని, అడవిని ‘కులం’ పేరుతో విభజించి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని, అక్రమ మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఎన్జీఓలు ఆరోపించాయి.
పర్యావరణానికి జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుపనున్నట్టు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం (ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్) కొల్లాపూర్ లో ప్రెస్ మీట్ ఉంటుందని స్పష్టం చేశారు.
8 ఎన్జీఓల సంయుక్త వేదికలో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ , ఇండియన్ సొసైటీ ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ , నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్‌మెంటల్ డెవలప్‌మెంట్ సొసైటీ ,
ప్రకృతి పర్యావరణ సంరక్షణ సమితి, కుంధి/గ్లోబల్ బయోడైవర్సిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్, సుందర్‌లాల్ బహుగుణ పర్యావరణ పరిరక్షణ సొసైటీ, ఎన్విరాన్‌మెంట్ & వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ లు ఉన్నాయి. పూర్తి వివరాలకు రమేష్ జెట్టిని 95020 01450 నంబర్‌లో సంప్రదించొచ్చు.