– సైబర్ నేరాల నివారణపై పోలీస్ శాఖ కృషి

– వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు

వేద న్యూస్,నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :

వేములపల్లి మండల వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుచున్నట్లు వేములపల్లి ఎస్సై డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు ప్రతివారం ఒక్క ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాల రూపంలో చేపట్టబడుతుందని పేర్కొన్నారు.“ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్‌ను విడుదల చేశారు.దేశవ్యాప్తంగా ప్రతీ రోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల ద్వారా నష్టం జరుగుతోందని అన్నారు. దీనిని నివారించగల మార్గం ప్రజల్లో అవగాహన పెంపుదలేనని చెప్పారు. చదువుకున్న యువత సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటే తమ కుటుంబ సభ్యులకు, పరిసరాల్లోని ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు అనుమానాస్పద లింకులు, ఫైళ్ళు పంపిస్తే క్లిక్ చేయవద్దని సూచించారు.ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ తక్షణ చర్య తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్లు పంచాయతీ కార్యదర్శి జానీ, కానిస్టేబుల్ కిషన్,రామ నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.