అఖిల భారత పులుల గణనలో ఔల్స్ స్వచ్చంద సంస్థ
- ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏ.ఐ.టి.ఈ.) 2026’లో తెలంగాణ అటవీ శాఖతో భాగస్వామ్యం కానున్న ‘ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ’ (ఔల్స్) స్వచ్ఛంద సంస్థ
వేద న్యూస్, హనుమకొండ :
పర్యావరణ పరిరక్షణలో ముందుండే ప్రముఖ హరిత స్వచ్ఛంద సంస్థ ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (ఔల్స్), దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘అఖిల భారత పులుల గణన (ఏ.ఐ.టి.ఈ.) 2026’ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని పులుల సంఖ్యను, అటవీ పర్యావరణ ఆరోగ్యాన్ని అంచనా వేసే ఈ భారీ గణన కార్యక్రమం జనవరి 19 నుండి జనవరి 25, 2026 వరకు వారం రోజుల పాటు జరగనుంది. తెలంగాణ అటవీ శాఖతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా, ఓల్స్ సంస్థకు చెందిన శిక్షణ పొందిన వాలంటీర్లు రాష్ట్రంలోని కీలకమైన అటవీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి డేటా సేకరణలో పాల్గొననున్నారు. కవాల్ టైగర్ రిజర్వ్,అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఖమ్మం ఫారెస్ట్ సర్కిల్ ప్రాంతాల్లో వీరు సేవలు అందించనున్నారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం:
ఈ గణన ప్రాముఖ్యత గురించి పర్యావరణవేత్త, ఔల్స్, జాయింట్ సెక్రటరీ, రవిబాబు పిట్టల మాట్లాడుతూ.. భారత మరియు తెలంగాణ అటవీశాఖలు కలిసి 4 సంవత్సరాలకొకసారి చేపట్టే ఈ ప్రతిష్టత్మకంగా గణనలో ఔల్స్ సంస్థ సభ్యులు పులుల గణన వాలెంటీర్స్ గా ఎన్నికై పాల్గొనడం చాలా హర్షనీయంఅన్నారు . “ఈ గణన కేవలం పులుల సంఖ్యను లెక్కించడం మాత్రమే కాదు, ఇది మన అడవుల్లోని మొత్తం ఫ్లోరా, ఫౌణ, అటవీ ఆవాసాల తీరు, వాటిలోని జీవవైవిధ్యాన్ని అంచనా వేసే ప్రక్రియ. అటవీ శాఖతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు గర్వకారణం. మా వాలంటీర్లు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లో ‘ట్రాన్సెక్ట్ వాక్స్’ నిర్వహిస్తూ పులుల ఉనికిని, వాటి ఆహార లభ్యతను (ఆహార గొలుసు) గుర్తించడంలో సహాయపడతారు,” అని తెలిపారు.
క్షేత్రస్థాయి విధులు:
జనవరి 19–25 ఈ వారం రోజుల పాటు ఔల్స్ వాలంటీర్లు అటవీ అధికారుల పర్యవేక్షణలో కింది విధులను నిర్వహిస్తారు:
లైన్ ట్రాన్సెక్ట్స్:శాఖాహార జంతువుల సాంద్రతను, అటవీ వృక్షాల, గడ్డిమైదానాల స్థితి గతులను, అటవీ నివాస, సముచిత స్థానం (నిచే), ఆవాసాల నివాస యోగ్యతను పర్యవేక్షించడం.
కార్నివోర్ సైన్ సర్వేలు: వివిధ అటవీ, నదుల దారుల్లో, నీటి ఆవాసాల ప్రాంతాల్లో పులుల అడుగుజాడలు (పగ్మార్క్స్), విసర్జితాలు (మలమూత్రాలు), చెట్లపై గోళ్ల గీతలు, కెమెరా ట్రాప్స్, సముచిత స్థానం (నిచే), పులుల, పక్షుల, ఇతర జంతువుల అరుపులు, అలికిడి విని శబ్దాలు చేసే జంతువులు (ఉదా: లాంగూర్స్, బర్డ్స్), ఎర (ప్రే) ను తిని వదిలేసిన మృత కళేభరాల సైజు, వేటాడిన గాట్లు, వాటిని పట్టి కొరికి తినే పద్ధతి గుర్తింపులు వంటి సంకేతాలను అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులు మరియు సాంకేతికతను ఉపయోగిస్తూ లెక్కించి డేటా సేకరించడం.
డిజిటల్ రిపోర్టింగ్: అత్యాధునిక ఎం-స్ట్రైప్స్ మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ ఆధారిత డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేయడం.
టైగర్ పులుల రక్షిత ప్రాంతం, వాటి కారిడార్ల బలోపేతం: ఖమ్మం, అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (నల్లమల) మరియు కవాల్ పులుల రక్షిత ప్రాంతం వంటి ప్రాంతాల్లో ఓల్స్ సంస్థ భాగస్వామ్యం ఎంతో కీలకం.
తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పులుల రాకపోకలకు ఈ ప్రాంతాలు ప్రధాన రహదారులుగా (కారిడార్లుగా) పనిచేస్తాయి.
ఈ గణన ద్వారా సేకరించిన సమాచారం పులుల సంరక్షణకు మరియు మానవ-వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడానికి, భవిష్యత్తులో అటవీ ఆవాసాల అభివృద్ధికి శాస్త్రీయ విధానాలు తీసుకునే నిర్ణయాలకు తెలంగాణ అటవీ ప్రాంతాలలో పులుల గణన కోసం ఉపయోగిస్తున్న అత్యాధునిక శాస్త్రీయ పద్ధతులు మరియు సాంకేతికతను ఉపయోగిస్తూ లెక్కించడం ఎంతో దోహదపడుతుందని ప్రముఖ పర్యావరణవేత్త, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (ఔల్స్), రవి బాబు పిట్టల ఒక ప్రత్యేక ప్రకటనలో తెలియచేసారు.