= భర్త ఎల్ఎల్బీ.. భార్య బీకాం కంప్యూటర్స్
= రాజన్న సన్నిధిలో దంపతుల విషాద గాథ
= కుటుంబాలతో కలిపే ప్రయత్నం చేస్తాం: అదనపు ఎస్పీ చంద్రయ్య
వేద న్యూస్, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునే రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఓ దీన గాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాన్వెంట్ చదువులు, ఉన్నత డిగ్రీలు ఉన్నా కాలగతి వల్ల ఓ దంపతులు నేడు యాచకులుగా మారిన పరిస్థితి హృదయ విదారకంగా మారింది. వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారికి పోలీసులు, అధికారులు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఓ జంటతో మాట్లాడిన అధికారులు వారు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. భర్త జలంధర్ రెడ్డి ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన విద్యావంతుడు. భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ పట్టభద్రురాలు. కరీంనగర్‌కు చెందిన ఈ దంపతులు భార్య ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెకు తోడుగా ఉంటూ రాజన్ననే దిక్కుగా భావించి వేములవాడకు వచ్చినట్లు తెలిసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఆలయ ప్రసాదంతోనే జీవనం సాగిస్తున్నారు. భార్య కోసం అన్నిటిని వదులుకుని అండగా నిలిచిన భర్త వైఖరి అధికారులను సైతం భావోద్వేగానికి గురి చేసింది. కేవలం ఈ దంపతులే కాకుండా ఆలయ పరిసరాల్లో సుమారు 100 మందికి పైగా యాచకులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులే. కొందరు కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక, మరికొందరు భయాందోళనలతో ఇక్కడికి చేరినట్లు తెలిపారు. ‘ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి… కానీ మమ్మల్ని ఆదరించే మనసున్న వారు లేరు. అందుకే రాజన్నే మాకు ఆధారం’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో భిక్షాటన నిషేధమని తెలిపారు. అయితే సమస్యల్లో ఉన్నవారికి సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వృద్ధులను వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, కౌన్సెలింగ్ ద్వారా వారిని తిరిగి కుటుంబాలతో కలిపే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఉన్నత విద్య ఉన్నా పరిస్థితులు మారితే మనిషి ఎంతటి కష్టాలనైనా ఎదుర్కోవాల్సి వస్తుందనే వాస్తవాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మనిషిని దిగజార్చినా, కష్టకాలంలోనూ విడిపోని దంపతుల బంధం ఒక విలువైన సందేశంగా నిలిచింది.