వేద న్యూస్, ఫోకస్ టీమ్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆదివారం చారిత్రక ప్రసిద్ధి గాంచిన గణపేశ్వర ఆలయ (కోటగుళ్ళు) సమీపంలోని పురాతన ఎర్రమ్మ ఆలయం వద్ద కొందరు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో, అధికారుల నిఘా ఉండదని భావించిన సదరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
పాత జ్ఞాపకాలు.. నిధుల వేటకేనా..?
గతంలో ఈ ఆలయ పరిసరాల్లో భూగర్భం నుండి భారీగా బంగారు ఆభరణాలు, పురాతన నాణేలు , గుప్తనిధులు బయటపడినట్లు ప్రతీతి. దీంతో ఈ ప్రాంతంపై ఇప్పటికే నిధి అన్వేషకుల కన్ను పడింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, ఇదే అదునుగా భావించిన కొందరు పురావస్తు శాఖలో ఉనన్న ఈ ఆలయంలో శుభ్రత పేరుతో తవ్వకాలు జరుపుతుండటాన్ని చూసి గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించని యంత్రాంగం..!?
కాకతీయుల కాలం నాటి అపురూప కట్టడాలకు నిలయమైన గణపురంలో ఇలాంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పురావస్తు శాఖ గానీ, స్థానిక రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక సంపదను కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ తవ్వకాలను నిలిపివేసి ఆలయానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపకపోతే పురాతన సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.