వేద న్యూస్, వరంగల్ టౌన్ :
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య(లియాఫీ) 1964 వరంగల్ డివిజన్ కార్యవర్గ సమావేశం డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్ అధ్యక్షతన శనివారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ కమిటీలో పలు కీలక పదవులకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్గా నగరంలోని ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన ఆవునూరి కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ కార్యక్రమాలు, ఏజెంట్ల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్త బాధ్యతలు స్వీకరించిన ఆవునూరి కుమారస్వామి మాట్లాడుతూ యూనియన్ బలోపేతం, ఏజెంట్ల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన డివిజన్ అధ్యక్షులు పులి సుధాకర్, రెసిడెంట్ సెక్రటరీ పబ్బా రాజా శ్రీనివాస్ మరియు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.