= మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్
= నెక్ట్స్ తెలంగాణే అంటూ ఢిల్లీ పెద్దల సంకేతాలు
= రాష్ట్రంలో కమలం పార్టీ బెంగాల్ వ్యూహం అమలు
= ఈనెల 10న మోడీ పర్యటన ఖరారు
= లోకల్ నాయకత్వ మార్పు తప్పదా?
= అప్రమత్తమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
= కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పదవుల భర్తీ
= దూకుడు పెంచనున్న బీఆర్ఎస్
= కారు పార్టీలో పెరిగిన నాయకత్వ కొరత
= కేటీఆర్ హరీష్ పైనే భారీ భారం

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో:
దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉత్తరాది గాలి దక్షిణాదికి, అందునా తెలంగాణకు బలంగా తాకబోతోందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తమ భవిష్యత్తు కార్యాచరణను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ కాషాయ జెండాను ఎగరవేయడం కేవలం ఆ రాష్ట్రాల విజయంగానే కాకుండా, తెలంగాణపై పట్టు సాధించేందుకు ఒక ఊతంగా మారింది. ఈ ఫలితాల తర్వాత రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. వచ్చే ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుండడంతో తమ వ్యూహాలను పదనుపెడుతున్నాయి.

బెంగాల్ స్ట్రాటజీ
గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో పట్టు సాధించాలని చూసిన బీజేపీ, ఇటీవలి కాలంలో అక్కడ సాధించిన ఫలితాలు దేశాన్ని ఆకర్షించాయి. ఇప్పుడు అదే పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని మోడీ-షా ద్వయం భావిస్తోంది. బెంగాల్‌లో ఎలాగైతే అధికార పార్టీని ఢీకొట్టడానికి స్థానిక బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేశారో, తెలంగాణలోనూ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. దూకుడుగా ఉండే నాయకులను గుర్తించి, క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగులేని బలాన్ని కల్పించడం ఈ వ్యూహం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 10న తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనను బీజేపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ పర్యటన ద్వారా పార్టీ క్యాడర్‌లో కొత్త జోష్ నింపాలని అదిష్టానం యోచిస్తోంది.

లోకల్ లీడర్‌షిప్‌పై బీజేపీ అధిష్టానం కన్ను..
తెలంగాణలో ఉన్న బీజేపీ లోకల్ నాయకత్వాన్ని ప్రక్షాళన చేయడమే కాకుండా, దూకుడుగా ఉండే నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడే నాయకులను గుర్తించి ఒక ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా, మీడియాలో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేతలకు ఈ టీమ్‌లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ దూకుడు రాజకీయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలనేది బీజేపీ ప్లాన్.

రేవంత్ సర్కార్ అలెర్ట్..
బీజేపీ దూకుడును గమనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. తెలంగాణలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ మతం లేదా జాతీయవాదం కార్డు ప్లే చేయకుండా, తన పాలనలోని అభివృద్ధి అజెండాను ప్రజల ముందు ఉంచాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కావడం అనేది జాతీయ రాజకీయాల్లోనూ కీలకమైన అంశం. రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, అందుకు అవసరమైన ఎంపీ సీట్లను తెలంగాణ నుంచే అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థాగత పదవుల భర్తీని వేగవంతం చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను పునర్నిర్మించి, ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్‌లో నాయకత్వ లేమి చర్చ..
మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లోపంపై చర్చ జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నడిపించిన కేసీఆర్, ప్రస్తుతం వయసు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా అన్ని ప్రాంతాల్లో పర్యటించలేని పరిస్థితి నెలకొంది. కేసీఆర్ యాక్టివ్‌గా ఉంటేనే కేడర్‌లో ఉత్సాహం ఉంటుందని భావించే కార్యకర్తలు, ఇప్పుడు ఆయన తక్కువగా కనిపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రభావం చూపగల నేతల కోసం కేడర్ వెతుకుతోంది. కేసీఆర్ పర్యటనలు తగ్గడంతో పార్టీ మొత్తం భారం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావుల భుజాలపై పడింది. ఈ ఇద్దరు నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మాజీ మంత్రులు మరియు ఇతర కీలక నేతలు గతంలో లాగా చురుగ్గా పాల్గొనడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే కేవలం ఇద్దరు నేతలు మాత్రమే కాకుండా, అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.