= గణపతిదేవుని గడ్డపై పాలకుల విధ్వంసం
= మట్టికోట సాక్షిగా.. కూలిన చారిత్రక శివాలయం
= వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో శిల్పకళా మౌన రోదన
= పురావస్తు శాఖ పరిధిలో ఉండగానే కూల్చివేత
= గతంలో పునరుద్ధరణ పనులు ప్రారంభించి అర్ధాంతరంగా నిలిపివేత
= మైలిసెట్టి కుమారుడు అప్పిసెట్టి వేయించిన శాసనాలు మట్టిపాలు
= ఎవరికోసం ఈ విధ్వంసం అంటూ ప్రశ్నిస్తున్న చరిత్రకారులు
= తక్షణమే ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
వేద న్యూస్, (ఎల్.కే) ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ గడ్డపై కాకతీయుల పాలన అంటేనే ఒక స్వర్ణయుగం. శిల్పకళకు జీవం పోసిన ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, శత్రుదుర్భేద్యమైన కోటలు.. ఇవే నేటికీ మన అస్తిత్వానికి ఆనవాళ్లు. ఆధునిక ఇంజనీరింగ్‌కు సవాలు విసిరేలా వందల ఏళ్ల క్రితమే అద్భుత కట్టడాలను నిర్మించిన కాకతీయ చక్రవర్తుల వారసత్వ సంపదపై పాలకులు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో వెలసిన 800 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని నేలమట్టం చేయడం ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా సంచలనంగా మారింది. వారసత్వ సంపదను కాపాడాల్సిన పాలకులే స్వయంగా కూల్చివేతలకు పాల్పడటంపై చరిత్రకారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు గొప్పగా పిలిచే మట్టికోట శిథిలాల మధ్య ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని ధ్వంసం చేయడం ఎవరి కోసమనే పలు అనుమానాలతో పాటు స్థానికులు, చరిత్రకారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
గణపతిదేవుని కాలం నాటి ఘన చరిత్ర
అశోక్‌నగర్ సమీపంలో మట్టికోట మధ్యలో విరాజిల్లిన ఈ శివాలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం, శాసన సంపుటులు, యాన్వల్ రిపోర్ట్ ఆన్ ఎపీగ్రఫీ వంటి చారిత్రక ప్రామాణిక గ్రంథాల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. క్రీ.శ. 1232 ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఆలయం వద్ద వేయించిన తెలుగు శాసనం ప్రకారం.. కాకతీయ సామ్రాజ్య సార్వభౌముడు గణపతిదేవుని కాలంలోనే ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా వెలిగింది.
శాసనాల్లోనూ సజీవ సాక్ష్యం
మైలిసెట్టి కుమారుడు అప్పిసెట్టి, సోమనాథదేవుని (శివుడి) నిత్య దీపారాధన కోసం రెండు మాడలను దానం చేసినట్లు ఈ శాసనం వివరిస్తోంది. ఆ కాలంలోనే ఆ నిధిని వడ్డీకి ఇచ్చి, ఆ ఆదాయంతో ఆలయంలో అఖండ దీపారాధన చేయాలని నిబంధన విధించారు. ఇది కాకతీయుల కాలం నాటి దేవాలయ పరిపాలన దక్షతకు, ఆర్థిక వ్యవస్థకు, వారు పాటించిన భక్తి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం. అటువంటి మహత్తర చరిత్ర ఉన్న ఆలయాన్ని నేడు కుప్పలుగా మార్చడం తెలంగాణ సంస్కృతిని అవమానించడమే.
ఆనవాళ్లు కోల్పోయిన వారసత్వం
ఈ ప్రాంత శాసనాల్లో గణపతిదేవుణ్ణి ‘శ్రీమన్మహారాజాధిరాజులైన’ అని సంబోధించడం వారి సార్వభౌమాధికారానికి గుర్తింపు. కాకతీయ శాసనాల్లో కనిపించే ‘రాజగజకేసరి’, ‘దాయగజకేసరి’ వంటి బిరుదులు వారి పరాక్రమాన్ని ప్రతిబింబిస్తాయి. అశోక్‌నగర్‌తో పాటు గుడితండా, దిచ్చకుంట వంటి మారుమూల ప్రాంతాల్లో లభించిన ఇటువంటి ఆధారాలే తెలంగాణ చరిత్రకు విలువైన ఆస్తులు. గడిచిన 800 ఏళ్లుగా భీకర వరదలను, కాలగమనాన్ని తట్టుకొని సగర్వంగా నిలబడిన ఆ మట్టికోట, ఆ శివాలయం.. నేడు అధికారుల అత్యుత్సాహానికి బలైపోయాయి. పురావస్తు శాఖ రక్షణలో ఉండాల్సిన కట్టడాన్ని బుల్డోజర్లతో ధ్వంసం చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాకతీయ ఆలయాలూ నేలమట్టమే!
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అత్యుత్సాహం వెరసి వందల ఏళ్లనాటి చరిత్ర నేలమట్టమైంది. స్థానికులు ‘కోటకట్ట’గా పిలుచుకునే ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయాన్ని కుప్పలుగా మార్చి పడేశారు. వందల ఏళ్లుగా పూజలందుకున్న గుడిని, పవిత్రమైన ఆలయ ప్రాంగణాన్ని ఇలా ధ్వంసం చేయడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాల పట్ల గౌరవం లేని వారి పాలన కొనసాగుతోందని చరిత్ర ప్రేమికులు మండిపడుతున్నారు.
రాష్ట్ర పురావస్తు శాఖ మౌనం..
ఈ ఆలయం రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, ఈ విధ్వంసం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారసత్వ సంపదను పునరుద్ధరించాలని గతంలో విన్నవించినా పట్టించుకోని అధికారులు, ఇప్పుడు దానిని పూర్తిగా నేలమట్టం చేయడానికి ఎలా అనుమతించారనేది మిస్టరీగా మారింది. తెలంగాణ అస్తిత్వం మీద, ఇక్కడి చరిత్ర మీద కనీస అవగాహన లేని వారి వల్లనే మన మూలాలు కనుమరుగవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అపురూపమైన శిల్పకళా సంపద శాశ్వతంగా నశించిపోయే ప్రమాదం ఏర్పడింది.
పునరుద్ధరించాలని నిరసన జ్వాలలు
తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నమైన కాకతీయ ఆలయాన్ని ధ్వంసం చేయడం అంటే 800 ఏళ్ల చరిత్రను సమాధి చేయడమే. ఈ విధ్వంసాన్ని తక్షణమే ఆపి, శిథిలాలను సేకరించి పాత పద్ధతిలోనే ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రజలు, చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి చారిత్రక సంపదను కాపాడాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. కాకతీయుల ఆనవాళ్లు లేని వరంగల్ ఉనికిని కోల్పోతుందని, ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకుని ఈ అపచారాన్ని సరిదిద్దాలని చరిత్రకారులు వేడుకుంటున్నారు.