నేను ఒంటరిదానిని.. ఇల్లు కట్టుకోనివ్వండి
= ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో వృద్ధురాలికి అడ్డంకులు
= స్థలం మాదంటూ స్థానిక నేత కుమారుడి బెదిరింపులు
= రెండో విడత నిధులు ఆపించారంటూ బాధితురాలి ఆవేదన
= పోలీసులు, అధికారులు స్పందించాలని విజ్ఞప్తి
= వరంగల్‌లో వృద్ధ మహిళ కన్నీటి గాథ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
వరంగల్ నగరంలో ఓ వృద్ధురాలి ఆవేదన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌లోని వెంకట్రామ థియేటర్ సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఉన్న భగత్‌సింగ్ నగర్ కాలనీలో గత 19 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న జన్ను శాంతమ్మ అనే వృద్ధ మహిళ తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయని కన్నీటి పర్యంతమవుతూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణించిన తర్వాత కూడా అదే స్థలంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్న శాంతమ్మను ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. మొదటి విడత బిల్లు కూడా విడుదల కావడంతో ఆ డబ్బులతో బేస్‌మెంట్ పనులు పూర్తి చేసి పిల్లర్లు వేసుకోవడంతో పాటు బోర్ కూడా తవ్వించుకున్నారు. ఇక గోడల నిర్మాణం ప్రారంభిద్దామని సిద్ధమవుతున్న సమయంలో స్థానిక రాజకీయ నాయకుడు, అతని కుమారుడు వచ్చి ఈ స్థలం మాది అంటూ తనను బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వృద్ధురాలు ఆరోపించారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండో విడత ఇందిరమ్మ నిధులు విడుదల కాకుండా అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసి డబ్బులు ఆపించారని కూడా ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకొని బాధితురాలు జన్ను శాంతమ్మకు న్యాయం చేయాలని, ఆమెకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని అందులో గౌరవంగా జీవించేలా సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.