= మాయమాటలతో అన్నదాతకు మస్కా
= చిక్కితే చివరకు మిగిలేది కన్నీళ్లే
= అధిక దిగుబడి ఆశ చూపుతున్న కేటుగాళ్లు
= పెట్టుబడి, మందులు ఫ్రీ అంటూ నమ్మబలుకుతున్న వైనం
= పండించిన పంటను ‘బెరికి’ పేరుతో పీకిస్తున్న ఆర్గనైజర్లు
= కమీషన్ల కక్కుర్తితో కంపెనీ ఇచ్చే డబ్బులు సైతం జేబుల్లోకే
= మాయా సీడ్ వద్దు అంటున్న నిపుణులు

వేద న్యూస్, కరీంనగర్:
ప్రస్తుత రోజుల్లో రైతులు అధిక దిగుబడి, భారీ లాభాల ఆశతో పంట సాగు విధానాన్నే మార్చేశారు. పూర్వం ఒక రైతు తనకున్న భూమిలో రకరకాల పంటలు వేసి ఆదాయం పొందేవాడు. కానీ నేడు అధిక లాభాల కోసం ఆడ-మగ సీడ్ వంగడాలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీన్నే అదునుగా తీసుకుంటున్న కొన్ని సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. మాయమాటలతో అన్నదాతలను బురిడీ కొట్టిస్తున్నారు.

కొండంత ఆశ.. గోరంత ఫలితం
సీడ్ కంపెనీల ఆర్గనైజర్లు రైతుల వద్దకు వచ్చి తమ కంపెనీ విత్తనాలు వాడితే రికార్డు స్థాయిలో దిగుబడి వస్తుందని, క్వింటాలుకు భారీ ధర చెల్లిస్తామని నమ్మిస్తారు. పెట్టుబడి, ఎరువులు, పురుగుల మందులు, చివరకు హార్వెస్టింగ్ కూడా ఉచితమని రకరకాల ఆఫర్లతో రైతులను ట్రాప్ చేస్తారు. తీరా సాగు మొదలుపెట్టాక కంపెనీ నుంచి వచ్చే పెట్టుబడి డబ్బులను డీలర్లు, ఆర్గనైజర్లు నొకేస్తూ.. రైతులకు మాత్రం చాలా తక్కువ మొత్తాన్ని అందిస్తున్నారు. దీంతో రైతులు గత్యంతరం లేక బయట అప్పులు చేసి లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు.

క్వాలిటీ పేరుతో సాకులు..
పంట కోతకు వచ్చే సమయంలో కంపెనీ క్వాలిటీ అధికారులు వచ్చి, పంటలో బెరికి (వృథా మొక్కలు) ఉందని సాకులు చెబుతారు. ఆ మొక్కలను తీసేస్తేనే ధాన్యం కొంటామని హెచ్చరిస్తారు. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలో దాదాపు 30 నుంచి 40 శాతం మొక్కలను బెరికి రూపంలో పీకి అవతల పారేస్తుంటే.. రైతులకు కళ్ళ నుండి నీరు కాదు రక్తం కారే పరిస్థితి ఎదురవుతోంది. అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పే ఆర్గనైజర్లు, సమయానికి మాట మార్చి రైతులను నట్టేట ముంచుతున్నారు.

సొచ్చేదాకా సోమలింగం..
వడ్ల కుప్పలు పోసే వరకు మేమున్నాం.. కంపెనీతో మాట్లాడి న్యాయం చేస్తాం అని నమ్మబలికే ఆర్గనైజర్లు, పేమెంట్ సమయం వచ్చేసరికి అసలు రంగు బయటపెడుతున్నారు. కంపెనీ ఇచ్చే పూర్తి డబ్బులను రైతులకు చేరనివ్వకుండా, తమ కమీషన్ల కక్కుర్తితో అదనపు మొత్తాన్ని దొబ్బేస్తున్నారు. చివరకు మిగిలిన తక్కువ డబ్బులను కూడా సకాలంలో ఇవ్వకుండా అమావాస్యకు ఒకసారి, పున్నానికి ఒకసారి ఇస్తూ రైతుల గుండెలపై గునపాలు గుచ్చుతున్నారు. సొచ్చేదాకా సోమలింగం.. సొచ్చినాక రామలింగం అన్న చందంగా ఆర్గనైజర్ల తీరు తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోకల్ వరే ముద్దు..
ఆడ-మగ వరి వంగడాల సాగులో శ్రమ, పెట్టుబడి ఎక్కువగా ఉండటమే కాకుండా, అధిక రసాయనాలు వాడటం వల్ల భూసారం దెబ్బతిని పర్యావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. అందుకే రైతులు ఇప్పటికైనా మేల్కొని లోకల్ వరి వంగడాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లోకల్ వరిలో శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండి, సురక్షితమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సీడ్ కంపెనీల ట్రాప్‌లో పడకుండా ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, సంబంధిత శాఖ అధికారులు స్పందించి మోసపూరిత సీడ్ కంపెనీలపై, కక్కుర్తి పడే ఆర్గనైజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి రైతుకు అగ్రిమెంట్ కాపీ అందేలా చూసి, సకాలంలో పూర్తి డబ్బులు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *