వేదన్యూస్ పాలకుర్తి
పాలకుర్తి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ) విధులు నిర్వర్తిస్తున్న గంటి శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వరంగల్ జిల్లా హనుమకొండ పరిధిలోని భవానీ నగర్‌లో ఉన్న తన సొంత ఇంట్లో ఓ బాధితుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 10 డబుల్ బెడ్ రూమ్ (2BHK) ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను పాస్ చేయడానికి, ఎం-బుక్ లో తుది కొలతలు నమోదు చేయడానికి సదరు అధికారి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశాడు.
బాధితుడి సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేసి లంచం డబ్బును స్వాధీనం చేసుకోవడంతో పాటు అధికారిని అరెస్ట్ చేశారు. రసాయన పరీక్షల్లో చేతులకు రంగు అంటడంతో అవినీతి బాగోతం బట్టబయలు కాగా, నిందితుడిని వరంగల్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు గానీ, వాట్సాప్ (9440446106) కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
