= బస్సు యాత్రతో కేసీఆర్, పాదయాత్రతో కేటీఆర్
= రానున్న ఎన్నికలే లక్ష్యంగా గులాబీ దళం వ్యూహాలు
= క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్
= రెండున్నరేళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రజల మధ్యకు గులాబీ దళపతి
= మొదట జిల్లాల పర్యటనలు..
= ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ బస్సు యాత్ర
= ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అజెండా
= భవిష్యత్తు పోరు కోసం ఇప్పటి నుంచే సమాయత్తం
= చారిత్రక పాదయాత్రకు కేటీఆర్ ప్లాన్
= ఇక నిరంతరం జనం మధ్య ఉండేలా అగ్రనేతల అడుగులు

వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త శకానికి నాంది పలుకుతోంది. గత ఎన్నికల పరాభవం, ఆ తర్వాత కొంతకాలం పాటు సాగిన స్తబ్దతను వీడి, తిరిగి పూర్వవైభవాన్ని పొందేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షంగా నిరంతరం ప్రజా పోరాటాలు సాగిస్తున్న తరుణంలో.. పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయిలో కేడర్‌ను పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంతకాలంగా పార్టీ అధినేత కేసీఆర్ పెద్దగా ప్రజల ముందుకు రాకపోవడంపై ఎదురైన విమర్శలకు గట్టి సమాధానం ఇస్తూ, గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా అగ్రనేతలు జనాల్లోకి వచ్చేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

కేసీఆర్ బస్సు యాత్రతో రీ ఎంట్రీ
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన పరంగా రెండున్నరేళ్ల పాటు తగిన సమయం ఇద్దామని, అందుకే ఇన్నాళ్లూ వేచి చూశామని బీఆర్ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక త్వరలోనే గులాబీ దళపతి కేసీఆర్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకం కాబోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ భవన్‌తో పాటు ప్రజా ఉద్యమాల్లో కేసీఆర్ నేరుగా పాల్గొననున్నారు. తొలుత జిల్లా పర్యటనల ద్వారా క్యాడర్‌ను కలిసి, ఆపై దానిని నెమ్మదిగా పెంచుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రైతులు, సామాన్యుల పక్షాన నిలబడి గులాబీ బాస్ స్వయంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పటిష్ట స్థితికి చేర్చనున్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలే ప్రధాన అస్త్రాలు
బస్సుయాత్ర మొదట 17రోజులపాటు సాగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కీలక అసెంబ్లీ స్థానాలలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్ధిపేట భారీ బహిరంగ సభతో ముగియనున్న ఈ యాత్రలో.. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఆరు గ్యారెంటీల పూర్తి స్థాయి అమలులో జాప్యం, పంటలు ఎండిపోయినా రైతులకు లభించని బోనస్, కరెంట్ కోతలు, పింఛన్ల పెంపు నిలిపివేత వంటి అంశాలపై కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయనున్నట్లు సమాచారం

పాదయాత్రతో కేటీఆర్
అటు అధినేత బస్సు యాత్రతో ఊపు తీసుకువస్తుంటే.. ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చారిత్రాత్మక పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలోనే కేటీఆర్ పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుందని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్, సమయాన్ని పార్టీ పెద్దలతో చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో భవిష్యత్తు ఎన్నికల పొత్తులపై కేటీఆర్ కీలక స్పష్టత ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీజేపీతో సహా ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో పొత్తులు తమకు కలిసి రాలేదని, క్షేత్రస్థాయిలో సొంత కేడర్ బలంతోనే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గులాబీ క్యాడర్‌లో సరికొత్త జోష్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ముగియడానికి ఇంకా రెండున్నరేళ్ల సమయం మిగిలి ఉంది. అయితే చివరి ఏడాది ఎన్నికల హడావిడి ఎలాగూ ఉంటుంది కాబట్టి, ముందే ప్రజల్లోకి బలంగా వెళ్లడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పూర్తిగా పునరుద్ధరించవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రల ద్వారా దాదాపు ఏడాదిన్నర పాటు నిరంతరం అగ్రనేతలు ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సుదీర్ఘ ప్రజా యాత్రలు గులాబీ శ్రేణుల్లో ఏ విధమైన జోష్‌ను తీసుకువస్తాయి, అధికార కాంగ్రెస్‌కు ఏ మేరకు తలవంపులు తెస్తాయి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *