•  సుస్థిర జీవవైవిధ్య రక్షణకు అంతర్జాతీయ సమగ్ర కార్యాచరణ అవసరం
  •  సమన్వయంతో స్థానిక చర్యలతో – గ్లోబల్ ప్రభావం
  •  భూమి నుండి జీవవైవిధ్యం వరకు సమగ్ర పరిరక్షణ
  •  గాలి, భూమి, జల జీవవైవిధ్య సుస్థిర భవిష్యత్తుకు మన సమిష్టి బాధ్యత
  • అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా స్థానిక సమస్యల పరిష్కార కార్యాచరణ కోసం పిలుపు
  •  2026 థీమ్ – “యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్”.

 

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం అంటే:

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ) ప్రతి సంవత్సరం మే 22న, జరుపుకుంటారు. భూమిపై ఉన్న వివిధ రకాల జీవరాశులు, పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం మరియు ప్రకృతి నాశనాన్ని అరికట్టడంపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. 1992 మే 22న ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ (సీ.బి.డి) అనే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదించినందుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. జీవవైవిధ్యాన్ని రక్షించడం, సహజ వనరులను భవిష్యత్తు తరాలకు అందేలా ఉపయోగించడం మరియు జన్యు వనరుల ప్రయోజనాలను అందరికీ సమానంగా పంచడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యాలు. ప్రపంచ జీవవైవిధ్యం ప్రస్తుతం వేగంగా మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కాలుష్యం, సహజ వనరుల అధిక వినియోగం వంటి మానవజనిత కారణాలు జీవరాశుల సమతుల్యతను భంగం చేసి, అనేక జాతులను విలుప్తి అంచుకు నెట్టుతున్నాయి. ఈ మార్పులు కేవలం కొన్ని జాతుల నష్టంతో మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం ఎకోసిస్టమ్‌ల స్థిరత్వాన్ని దెబ్బతీసి భూమిపై జీవన వ్యవస్థలను ప్రమాదంలో పడేస్తున్నాయి. జీవవైవిధ్యం తగ్గిపోతే ఆహార గొలుసులు విచ్ఛిన్నమవడం, నీటి చక్రం లోపించడం, గాలి నాణ్యత క్షీణించడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు; ప్రతి వ్యక్తి తన స్థాయిలో బాధ్యతగా వ్యవహరించడం అత్యంత ముఖ్యము. మనం నివసిస్తున్న స్థానిక ప్రాంతాల్లోని జీవరాశులు, వృక్షాలు, సూక్ష్మ మరియు స్తూల జీవులు, అడవులు, అటవీ జీవులు, నదులు, సరస్సులు, గాలి, నేల వంటి సహజ వనరులను సంరక్షించడం ద్వారా మాత్రమే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనగలం. స్థానికంగా చేపట్టే చిన్న చర్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులకు దారితీస్తాయి.

మే 22, 1992న ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ (సీ.బి.డి) ఒప్పందాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. జీవవైవిధ్యాన్ని కాపాడటం మరియు జన్యు వనరుల ప్రయోజనాలను సమానంగా పంచడం ఈ చట్టపరమైన అంతర్జాతీయ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. 2026 సంవత్సరపు థీమ్ – “యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్”. అంటే, ప్రపంచవ్యాప్త పర్యావరణ మార్పులు అనేవి స్థానికంగా మనం చేసే చిన్న చిన్న పనులతోనే మొదలవుతాయని ఈ నినాదం నొక్కి చెబుతోంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30% భూమి మరియు జల వనరులను రక్షించాలనే ‘కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్’ లక్ష్యాలను సాధించడంలో ఈ స్థానిక చర్యలు ఎంతో కీలకం. ప్రస్తుత జీవవైవిధ్య సంక్షోభం మరియు భూమి ఎదుర్కొంటున్న ముప్పులను అధిగమించడానికి ఈ రోజు ఒక అత్యవసర రిమైండర్‌గా పనిచేస్తుంది.

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా 2026 మే 22న దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ప్రధాన కార్యక్రమం (గ్లోబల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్) జరగనుంది. ఈ సంవత్సరం ఈ ప్రచార కార్యక్రమాన్ని “ప్రపంచ స్థాయి ప్రభావం కోసం స్థానికంగా కృషి” అనే అర్ధన్నించే “యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్” అనే ప్రత్యేక నినాదంతో, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.

ఈ వేడుక మే 22న స్థానిక సమయం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ (సీ.బి.డి) ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అయిన ఆస్ట్రిడ్ షోమేకర్ మరియు దక్షిణాఫ్రికా అటవీ, మత్స్య మరియు పర్యావరణ శాఖ మంత్రి హెచ్.ఇ. విల్లీ ఆక్యాంప్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ప్రధానంగా దక్షిణాఫ్రికాకు చెందిన ‘నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్’ (ఎన్.బి.ఎస్.ఏ.పి) పై నిర్వహించే ఒక కీలకమైన వాలిడేషన్ వర్క్‌షాప్‌పై దృష్టి సారించనుంది. పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఉన్న ప్రపంచవ్యాప్త వీక్షకుల కోసం ఈ అధికారిక కార్యక్రమ ప్రొసీడింగ్స్‌ను ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ అధికారిక ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమ్) చేయనున్నారు.

2026 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22) సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన “యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్” అనే థీమ్‌ను ప్రతిబింబిస్తూ ఒక ప్రత్యేకమైన లోగోను విడుదల చేశారు. ఈ లోగో ప్యాకేజీ ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికారిక భాషలలో, డిజిటల్ మరియు ఆఫ్‌లైన్ వినియోగానికి అనుగుణంగా అందుబాటులో ఉంది. ఈ లోగోలోని ‘వేలిముద్ర’ (ఫింగర్ప్రింట్) నమూనా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేయడమే కాకుండా, స్థానికంగా మనం చేసే పనులు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సానుకూల ప్రభావాన్ని (రిప్పలింగ్ ఎఫెక్ట్) చూపుతాయో వివరిస్తుంది. అలాగే, కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ (కె.ఎమ్.జి.బి.యఫ్) కి చెందిన 23 లక్ష్యాలను సూచిస్తూ వివిధ రంగులతో ఈ లోగోను రూపొందించారు. 2030 నాటికి జీవవైవిధ్య క్షీణతను అరికట్టాలనే ప్రపంచ లక్ష్య సాధనలో భాగస్వాములవుతూ, స్థానిక వేడుకల్లో ఈ లోగోను ఉపయోగించి సామాజిక మాధ్యమాల (ట్రేల్లోబోర్డు వంటివి) ద్వారా అవగాహన కల్పించాలని ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ (సీ.బి.డి) సెక్రటేరియట్ కోరుతోంది.

ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) నివేదికల ప్రకారం, మానవ కార్యకలాపాల వల్ల భూమిపై ఉన్న మూడొంతుల (75%) భూభాగం మరియు దాదాపు 66% సముద్ర పర్యావరణ వ్యవస్థలు ఇప్పటికే తీవ్రంగా మార్పులకు గురయ్యాయి. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల జంతు మరియు వృక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ఈ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడానికి వ్యక్తులు, పాఠశాలలు మరియు నగరాలు ఈ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ ప్రచారంలోని మూడు ముఖ్యమైన స్తంభాల (పిల్లర్స్) ద్వారా చొరవ చూపాలని పిలుపునిచ్చారు. చూడండి మరియు నేర్చుకోండి (లుక్ అండ్ లెర్న్): మొదటగా మీ స్థానిక ప్రాంతంలో ఉన్న వివిధ రకాల జీవవైవిధ్యాన్ని, పర్యావరణ విశేషాలను అన్వేషించి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. కనెక్ట్ అవ్వండి మరియు స్పందించండి (కనెక్ట్ అండ్ యాక్ట్): సమాజంలో జరిగే పర్యావరణ నడకలు (కమ్యూనిటీ వాక్స్), తోటల పెంపకం ప్రాజెక్టులు లేదా సిటిజన్ సైన్స్ డేటా సేకరణ వంటి స్థానిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి. షేర్ చేయండి (షేర్): మీరు చేసిన పర్యావరణ పరిరక్షణ పనులను, ఫోటోలను సామాజిక మాధ్యమాలలో #బయోదివర్సిటీడే అనే అధికారిక హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ఇతరులతో పంచుకోవడం ద్వారా మరింత మందిలో అవగాహన పెంచాలి. ఈ ప్రచారానికి సంబంధించిన మరిన్ని వనరుల కోసం మరియు మీ ప్రాంతానికి సమీపంలో జరిగే పర్యావరణ ఈవెంట్‌ల వివరాలను తెలుసుకోవడం కోసం ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ లేదా అధికారిక ‘కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ’ వెబ్‌సైట్ పోర్టల్‌ను సందర్శించవచ్చు.

స్థానిక చర్యలతో గ్లోబల్ మార్పు – భూమి నుండి జీవవైవిధ్యం వరకు సమగ్ర పరిరక్షణ: నేను వ్యక్తపరుస్తున్న ఆందోళన అక్షరాలా నిజం. మానవుడు తన స్వార్థం కోసం, అభివృద్ధి ముసుగులో శాస్త్ర-సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రకృతాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, రేపు (మే 22, 2026) మనం జరుపుకోబోయే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం మరియు దాని నినాదం “యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్” మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాయి. ఈ థీమ్ ఆధారంగా, భవిష్యత్తు తరాల కోసం మన జీవావరణాన్ని ఎలా రక్షించుకోవాలో ఇక్కడ వివరించడమైనది:

1. భౌమ్యావరణం మరియు నేల పరిరక్షణ (ప్రొటెక్టింగ్ ఎర్త్ అండ్ సాయిల్); మానవుని విచక్షణారహిత ఆంథ్రపోజెనిక్ (మానవజనిత) చర్యల వల్ల భూమి, నేల తీవ్రంగా కలుషితమైపోతున్నాయి. అడవులను నరికివేయడం, రసాయన ఎరువుల వాడకం వల్ల నేల తన సారవంతాన్ని కోల్పోయి ఎడారీకరణకు దారితీస్తోంది.

2026 థీమ్ ప్రకారం, దీనిని అరికట్టడానికి మనం స్థానికంగా సేంద్రీయ వ్యవసాయాన్ని (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలలో మొక్కలు నాటడం, అడవుల పునరుద్ధరణ (ఆఫరెస్టేషన్) చేపట్టడం ద్వారా భూక్షయాన్ని నిలిపివేయవచ్చు. స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, కొద్దిమంది స్వార్థపరుల కోసం పచ్చని అడవులను, కొండలను మైనింగ్ పేరిట ధ్వంసం చేయకుండా చట్టాలను కఠినతరం చేయాలి. నేలను రక్షించుకుంటేనే జీవుల మనుగడకు అవసరమైన ఆహార భద్రత లభిస్తుంది.

2. జలావరణం మరియు నీటి వనరుల రక్షణ (ప్రెజర్వింగ్ వాటర్ బాడీస్ అండ్ ఓసెన్స్); పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల నదులు, సముద్రాలు వంటి జలావరణాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. దీనివల్ల 66% పైగా సముద్ర జీవులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం స్థానిక స్థాయిలో జలవనరుల పరిరక్షణను ఒక ఉద్యమంగా చేపట్టాలి. వర్షపు నీటిని నిల్వ చేయడం (రైన్ వాటర్ హార్వెస్టింగ్), చెరువులు మరియు బావులను పూడికతీసి పునరుద్ధరించడం వంటి పనులు చేయాలి. అలాగే, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, సముద్రాల్లోకి రసాయన వ్యర్థాలు చేరకుండా కఠినమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలి. నీరు జీవనాధారం, కాబట్టి జలవనరులను కాపాడుకోవడం ద్వారానే జలచరాల జీవవైవిధ్యాన్ని మనం కాపాడగలం.

3. వాతావరణం మరియు గాలి నాణ్యత పెంపు (కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎయిర్ పొల్యూషన్); లాభాపేక్షతో నడిచే పరిశ్రమలు, మితిమీరిన వాహనాల వాడకం వల్ల వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పులు (క్లైమేట్ చేంజ్) వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల జీవులలో అకాల ఎవల్యూషనరీ (పరిణామక్రమ) మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి పరిష్కారంగా, మనం సంప్రదాయ శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించి, సౌరశక్తి (సోలార్ ఎనర్జీ), పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. స్థానికంగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం, సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా గాలి నాణ్యతను పెంచవచ్చు. పరిశ్రమల ఉద్గారాలపై అంతర్జాతీయ నిబంధనలను స్థానిక స్థాయిలో ఖచ్చితంగా అమలుపరిచేలా పాలకులను నిలదీయాలి.

4. జీవుల ఆవాసాల రక్షణ మరియు ఎకాలాజికల్ బ్యాలెన్స్ (ప్రొటెక్టింగ్ హాబిటేట్స్ అండ్ ఎకాలాజికల్ బాలన్స్); మానవుడు తన నివాసాల విస్తరణ కోసం వన్యప్రాణుల సహజ ఆవాసాలను ముక్కలు చేస్తున్నాడు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత (ఎకాలాజికల్ బాలన్స్) దెబ్బతిని, దాదాపు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ముప్పులో ఉన్నాయి. 2030 నాటికి 30% భూమి, జలాలను రక్షించాలనే ‘కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం స్థానిక జీవవైవిధ్య మండలాలను (బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ) కాపాడుకోవాలి. వన్యప్రాణుల కారిడార్లను రక్షించడం, జంతువుల వేటను అరికట్టడం, నగరాల్లో కూడా ‘అర్బన్ ఫారెస్ట్’లను పెంచడం ద్వారా జీవుల మనుగడకు భరోసా ఇవ్వవచ్చు. ప్రతి జీవికీ ఈ భూమిపై బతికే హక్కు ఉందని గుర్తించడమే అసలైన మానవ వికాసం.

5. అవగాహన, సామాజిక బాధ్యత మరియు స్థానిక చొరవ (అవేర్నెస్ అండ్ లోకల్ యాక్షన్ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్); స్వార్థపూరిత శక్తులు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రకృతిని దోచుకుంటున్నప్పుడు, ప్రజల్లో చైతన్యం రావడం ఒక్కటే దానికి సరైన విరుగుడు. 2026 బయోడైవర్సిటీ దినోత్సవం పిలుపునిచ్చినట్లుగా, పెద్ద మార్పులు ఎప్పుడూ చిన్న స్థానిక చర్యలతోనే మొదలవుతాయి. పాఠశాలలు, కళాశాలలు మరియు స్థానిక సంఘాల ద్వారా పర్యావరణ స్పృహను పెంపొందించాలి. పర్యావరణాన్ని నాశనం చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతుకను వినిపించాలి. సామాజిక మాధ్యమాలలో డిజిటల్ ప్రచారాలు (ఉదాహరణకు #బయోడైవర్సిటీడే లోగోను ఉపయోగించడం) చేయడం ద్వారా ప్రపంచవ్యాప్త ఉద్యమాలకు స్థానిక మద్దతును అందించాలి. మన చేతుల్లో ఉన్న వేలిముద్ర (ఫింగర్ప్రింట్) కేవలం మన గుర్తింపు మాత్రమే కాదు, రేపటి భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం అని గ్రహించి బాధ్యతగా మెలగాలి.

అంతర్జాతీయ జీవవైవిధ్య రక్షణకు అందరి భాగస్వామ్యం అవసరం:

జీవవైవిధ్య రక్షణకలో ప్రజల పాత్ర: ప్రపంచ ప్రజలు తమ జీవన విధానాలను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని ఆదా చేయడం, చెట్లు నాటడం, స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడే కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి చర్యలు ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఈ చర్యలు చిన్నవిగా కనిపించినా, సమిష్టిగా పెద్ద ప్రభావాన్ని చూపగలవు. స్థానికంగా మార్పులు తీసుకురావడం ద్వారా గ్లోబల్ స్థాయిలో పర్యావరణ రక్షణ సాధ్యమవుతుంది.

జీవవైవిధ్య రక్షణకలో ప్రభుత్వం పాత్ర: ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలి. గాలి, నీటి, భూ, ప్లాస్టిక్ కాలుష్యాల నియంత్రణ, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ వంటి అంశాలలో సరైన విధానాలు రూపొందించి వాటిని కచ్చితంగా అమలు చేయడం అవసరం. రాజకీయ నాయకులు మరియు పాలకులు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసే విధానాలకు దూరంగా ఉండి, సుస్థిర అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ పర్యావరణ చట్టాల అమలులో కీలక పాత్ర పోషించాలి. వారు కేవలం నియమాలను అమలు చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంలో కూడా ముందుండాలి. చట్టాల అమలు కఠినంగా జరిగితేనే పర్యావరణ నాశనాన్ని అరికట్టడం సాధ్యం.

జీవవైవిధ్య రక్షణకలో స్వచ్చంద సంస్థల (ఎన్.జి.ఓ’స్) పాత్ర: స్వచ్చంద సంస్థలు (ఎన్.జి.ఓ’స్) పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి ప్రజలకు అవగాహన కల్పించడం, వనరులను సమీకరించడం, స్థానిక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నాయి. ఈ సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా ప్రజలు మరింత ప్రభావవంతమైన మార్పులను తీసుకురాగలరు.

జీవవైవిధ్య రక్షణకలో వివిధ సంస్థల పాత్ర: విద్యాసంస్థలు మరియు శాస్త్రజ్ఞులు కూడా జీవవైవిధ్య సంరక్షణలో ముఖ్య పాత్రధారులు. విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంచడం, పరిశోధనల ద్వారా కొత్త పరిష్కారాలను కనుగొనడం, సాంకేతికతను సుస్థిర అభివృద్ధికి ఉపయోగించడం వంటి చర్యలు భవిష్యత్తుకు మార్గదర్శకాలు. యువత ఈ దిశగా చైతన్యవంతంగా ముందుకు రావాలి. పౌర సమాజం చట్టపరమైన చర్యలపై దృష్టి పెట్టాలి. పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలపై ప్రశ్నించడం, అవసరమైతే న్యాయపరమైన పోరాటాలు చేయడం, కోర్టు తీర్పులను గౌరవించడం ద్వారా సమాజంలో బాధ్యతాయుత వైఖరి పెంపొందుతుంది. చట్టాలు ఉండడం మాత్రమే సరిపోదు, వాటి అమలు మరియు పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం.

ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమతో చూసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న చర్య—ఒక చెట్టు నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం—ప్రపంచానికి ఒక పెద్ద సహాయం అవుతుంది. “లోకల్‌గా చేసే మార్పులు గ్లోబల్ ప్రభావాన్ని కలిగిస్తాయి” అనే భావనను మనం మనసులో పెట్టుకుని ముందుకు సాగాలి. మొత్తానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం అనేది మన అందరి ఉమ్మడి బాధ్యత. ప్రపంచ స్థాయిలో మార్పులు రావాలంటే స్థానిక స్థాయిలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన జీవన వాతావరణాన్ని అందించగలం. అందుకే, ఇప్పుడే చర్యలు తీసుకుంటూ జీవవైవిధ్య సంరక్షణలో భాగస్వాములవుదాం.

“నేటి జీవవైవిద్య సంరక్షనే – రేపటి జీవావరణ సుస్థిరత”

– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, ఫార్మర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే.ఎన్.టీ.యు.హెచ్., హైదరాబాద్ మరియు జాయింట్ సెక్రటరీ, ఔల్స్ ఎన్.జి.ఓ., తెలంగాణ. సెల్: +91 9849425271.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *