ప్రస్తుత ప్రజా పాలనలోనే అభివృద్ధి సాధ్యం అనే వాదనలు
ఇలాకాలో బస్టాండ్ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేనా?
అమాత్యులు తమ మొర ఆలకించాలని వేడుకోలు

వేద న్యూస్, ఫోకస్ టీమ్:
తాము ఎన్నుకున్న శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖలకు అమాత్యుడిగా కొలువు తీరడంతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అందులో మూడు జిల్లాలకు (హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్) ముఖ ద్వారం గా ఉన్న ఎల్కతుర్తి మండల కేంద్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండటం పట్ల ప్రజలు సంతోషపడుతున్నారు. ఇదే క్రమంలో ‘ప్రజా పాలన’గా పేరుపొందిన సర్కారులో మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రూపుదిద్దుకోవలసిన ‘షాపింగ్ కాంప్లెక్స్’ నిర్మాణంపై పట్టింపు లేకపోవడంతో చిరు వ్యాపారులు, మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన నాయకుడిగా, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందడమే కాకుండా స్వయంగా రవాణా శాఖ (ఆర్టీసీ) కు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమాత్యులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా.. నిర్మాణం పూర్తయ్యేలా దృష్టి సారించాలని చిరు వ్యాపారులు వేడుకుంటున్నారు.

అభివృద్ధియే ధ్యేయంగా అడుగులు..
మండల కేంద్రంలో బస్టాండ్ ప్రాంగణం, కూడలి విస్తరణ నేపథ్యంలో చిరు వ్యాపారులు గతంలో ఏర్పరచుకున్న షాపులు తీసివేయబడిన నేపథ్యంలో తాత్కాలికంగా మరల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మడిపల్లె రోడ్డు కు ఇరువైపులా మరికొందరు చిరు వ్యాపారులు షాపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తమకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అందులో వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇస్తూ.. చక్కగా షాపులు నిర్వహించుకునేలా ప్రజా ప్రభుత్వంలో అవకాశం ఉంటుందని భావించగా, అది ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. స్వయంగా కలెక్టర్ ,అధికారులు, అమాత్యులు.. గతంలో బస్టాండ్ ప్రాంగణము, కూడలి వద్ద పరిశీలన చేసిన క్రమంలో త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు పడతాయని భావించారు. కానీ, అసలు దానిని పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తమవుతున్నది. కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం రావడంతో పాటు మండల కేంద్రంలో చక్కటి వ్యాపార వాతావరణం నెలకొంటుందని అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రజా పాలన లోనే అభివృద్ధి సాధ్యమని వాదనలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయమై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కాంప్లెక్స్’ కథ ఖతం కాకూడదని, ఆ నిర్మాణం కోసం తమ ఎదురు చూపుల్లోనే కాలం గడిచిపోకూడదని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలనాటి హామీలలో భాగంగా దీనిపైన కూడా దృష్టి సారించాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వయంగా అమాత్యులు చొరవ తీసుకోవాలని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వ కాలంలోనే కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావాలని, లేనియెడల ఇక కగానే కాంప్లెక్స్ మిగిలిపోయే పరిస్థితులు ఉంటాయని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీ మంత్రి ఇలాకాలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో ‘షాపింగ్ కాంప్లెక్స్’ పూర్తి కావాలని, అది మంత్రి తలుచుకుంటే చిన్న పనేనని అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ‘చే’జారే పరిస్థితులు
ప్రస్తుత హుస్నాబాద్ నియోజకవర్గ శాసన సభ్యుడిగా , మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కీలకంగా ఉన్న నేతకు నియోజకవర్గ సంపూర్ణ పరిస్థితులపై అవగాహన ఉందని, అయితే అమాత్యుడిగా బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, ఆశలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు “చేతి”ని వీడే పరిస్థితులు నిండుగా , మెండుగా ఉంటాయని స్పష్టమవుతున్నది. ‘స్థానిక’ సర్పంచ్ ఎన్నికలలో కొన్ని స్థానాలు ఇప్పటికే ‘చే’జారిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వైఖరికి భిన్నంగా ముందుకు సాగవలసిన స్థితి నెలకొన్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా విషయాలను మంత్రి, ప్రభుత్వం దృష్టికి మండల, నియోజకవర్గ నాయకులు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంటుందని కొందరు అంటున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల నియామకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ నియామకాలలో ప్రజాదరణతో పాటు పార్టీకి కీలకంగా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని వాదనలు ఉన్నాయి. సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్ పదవికి ఆశావాహులు .. పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుభవము, అవగాహన ఉన్నవారికి పెద్ద పీట వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మనగలిగే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ‘నిధి’ని మాత్రమే సమకూర్చుకునే వారికి పదవులు వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీ పెద్దలు మరింత అప్రమత్తంగా, జాగరుకుతతో వ్యవహరించాలని అధికార పార్టీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు జిల్లాలకు ముఖ ద్వారం గా ఉన్న మండల కేంద్రంలో అభివృద్ధి  మునుపునకు భిన్నంగా, మరింత వేగవంతంగా జరగాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *