= పక్కదారి పడుతున్న వివాహ బంధాలు
= బలవుతున్న కుటుంబాలు
= ఆందోళన కలిగిస్తున్న వరుస హత్యలు
= దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న ఘటనలు
= భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి మరీ భార్య దారుణం
= నిజామాబాద్‌లో బయటపడ్డ సంచలన హత్య
= పెళ్లైన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్త చంపిన మరో భార్య
= హర్యానాలో కలవరపరిచిన ఘటన
= నేరాన్ని దాచిపెట్టేందుకు దొంగ ప్రమాదాలు, ఆత్మహత్యలుగా చిత్రీకరణ
= ఆధారాలు చెరిపేసినా పట్టిస్తున్న టెక్నాలజీ

వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
ప్రేమ, అనుబంధం, నమ్మకం మీద నిలవాల్సిన పవిత్రమైన కుటుంబ బంధాలు నేడు అనుమానాలు, అక్రమ సంబంధాలు, క్షణికావేశాలకు బలవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ విభేదాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ హత్యలు రోజురోజుకూ పెరుగుతుండటం సామాజికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్నచిన్న మనస్పర్థలు, అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న జీవిత భాగస్వాములను దారుణంగా హత్య చేసి.. ఆపై వాటిని ప్రమాదాలుగానో లేదా ఆత్మహత్యలుగానో చిత్రీకరిస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. కుటుంబ వ్యవస్థను కుదిపేస్తున్న ఈ తరహా దారుణ నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య..
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రశాంత్ హత్య కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య సంధ్య.. తన సహచరులు అనిల్, వెంకట సాయి అలియాస్ బంటిలతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్త తన సంబంధాన్ని వ్యతిరేకించడంతో దంపతుల మధ్య తరచూ విభేదాలు నెలకొన్నాయి, దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్యకు కుట్ర పన్నారు. మొదట హత్యాయత్నం చేయగా, గాయపడిన ప్రశాంత్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అయితే నిందితులు అంతటితో వదలకుండా.. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) ద్రావణాన్ని నరాల్లోకి ఇంజెక్ట్ చేసి అత్యంత కిరాతకంగా అంతమొందించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో భార్య సంధ్యతో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఊపిరాడకుండా చంపేసి.. రోడ్డు ప్రమాదంగా..
హర్యానాలోని రేవరి జిల్లా జడ్తాల్ గ్రామంలో కొద్ది రోజుల క్రితమే వివాహమైన మోను అనే యువకుడిని, అతని భార్య తన ప్రియుడు సోను, అతని స్నేహితులతో కలిసి ముందస్తు కుట్రతో హత్య చేసింది. మోనును ఒక కాలువ వద్దకు రప్పించి, ఊపిరాడకుండా చేసి చంపేసి.. ఆపై అదొక రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు అతడి స్కూటర్‌ను అక్కడే వదిలి వెళ్లారు. అయితే పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి మొబైల్ ఫోన్ డేటా, సైబర్ ఫోరెన్సిక్ ఆధారాలతో ఈ మాయాజాలాన్ని ఛేదించి భార్యతో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

టెక్నాలజీతో నేరస్థుల గుట్టురట్టు..
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఇలాంటి విపరీత ధోరణి కలిగిన కేసులు వరుసగా నమోదవుతున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారనే కారణంతో భర్తలు, భార్యలు, కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేయడం.. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు ఆధారాలు చెరిపేయడం, ప్రమాదాలుగా చూపించే ప్రయత్నాలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, నేరస్థులు ఎంత పక్కాగా ఆధారాలు తొలగించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో మొబైల్ ఫోన్ కాల్ డేటా, చాటింగ్, సీసీ కెమెరా దృశ్యాలు, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఎంతటి క్లిష్టమైన కేసులనైనా ఛేదిస్తూ నిందితులను దొరకబుచ్చుకుని చట్టం ముందు నిలబెడుతున్నారు.

హింస వద్దు.. చట్టబద్ధమైన మార్గాలే శరణ్యం
సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాంపత్య జీవితంలో లేదా భాగస్వాముల మధ్య తలెత్తే విభేదాలను హింసతో, హత్యలతో కాకుండా చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. పరస్పర అవగాహన, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే మానసిక నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి కంటితడి పెట్టించే విషాదాలను నివారించే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. ఇలాంటి ఘోర ఘటనలను అరికట్టేందుకు సమాజంలో కుటుంబ విలువలపై అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, కఠిన చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం నేడు అత్యంత అత్యవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *