ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా వనమహోత్సవం నిర్వహణ
వేద న్యూస్, వరంగల్:
“ఏక్ పేడ్ – మా కే నామ్” అనే నినాదంతో ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వరంగల్ ప్రాంగణంలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) ఆధ్వర్యంలో, పాఠశాల యాజమాన్యం సమన్వయంతో నిర్వహించగా, పలు స్వచ్చంద సంస్థలు పాల్గొని పండ్లనిచ్చే, నీడ నిచ్చే, ఎక్కువ ప్రణవయువునిచ్చే పెద్దమొక్కలు తెచ్చి కార్యక్రమానికి మద్దతు అందించాయి.
ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకువచ్చిన పెద్ద మొక్కలను OWLS సభ్యులు పాఠశాల ఆవరణంలో శాస్త్రీయ పద్ధతిలో నాటించారు. విద్యార్థులకు మొక్కలు నాటే సరైన విధానం, వాటి సంరక్షణ పద్ధతులను ప్రాక్టికల్‌గా వివరించారు.
కార్యక్రమంలో భాగంగా OWLS జనరల్ సెక్రటరీ శ్యాంసుందర్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే చెట్లు నాటే అలవాటు పెంపొందించుకోవాలని, చెట్ల వలన జీవవైవిధ్య సమతుల్యం కాపాడబడుతుందని తెలిపారు.
OWLS స్థాపక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, తల్లితండ్రుల, మిత్రుల, తమయొక్క పుట్టినరోజు ఒక మొక్కనాటి పర్యావరణ హితానికి పునుకోవాలని, మొక్కలు కూడా తల్లిలాంటివేనని, “ఏక్ పేడ్ – మా కే నామ్” అనే భావనను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సరితా రెడ్డి చేతుల మీదుగా “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” అనే చేతి పుస్తకాన్ని విడుదల చేసి, 50 మంది విద్యార్థులకు పక్షులపై అవగాహన పెంపొందించేందుకు అందజేశారు.
ప్రముఖ పర్యావరణవేత్త పిట్టల రవిబాబు మాట్లాడుతూ, భూమి వేడిమి, కాలుష్య కొరల్లో చిక్కుకున్నదని, దానిని కాపాడడం మన ధర్మమని, ప్రకృతి, పర్యావరణం, అడవులు, అటవీ జంతువులు మరియు సహజ వనరులను రక్షించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం ప్రతి పౌరుని ప్రాథమిక విధి అని తెలిపారు. అవసరానికి మించి సహజ వనరులను వినియోగించకూడదని, వాటిని సంరక్షించకపోతే జీవావరణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రముఖ అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ అయినా మారి ప్రతినిధి వెంకటేష్ చక్రం మాట్లాడుతూ చెట్లు జీవమనుగడకు సోపానలని వాటిని నరికివేసి వ్యవసాయ లోటు మార్పులకు మనమే కారణమని విద్యార్థులు ఈ విషయం గ్రహించి తల్లితండ్రుల్లో పర్యావరణ అవగాహన కలిగించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి సరితా రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, చిన్నప్పటి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను శాలువా కప్పించి మేమేంటోతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు పోసి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మరియు ఆర్ట్ టీచర్ శ్రీనివాస్ ముఖ్యపాత్ర వహించగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వనమహోత్సవాన్ని విజయవంతం చేశారు.
“వృక్షో రక్షతి రక్షితః – చెట్లను కాపాడుదాం, మన భవిష్యత్తును కాపాడుదాం”.
