= ముదురుతున్న కడియం వర్సెస్ కొండా వివాదం
= చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్..
= కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ సవాల్
= కూతురు కాంగ్రెస్ ఎంపీ.. తండ్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫైర్
= టీడీపీ నుండి వచ్చిన వలస నేతలే టార్గెట్ చేస్తున్నారన్న మంత్రి
= అధిష్ఠానం తేల్చకపోతే తాడోపేడో తేల్చుకుంటా..
= జిల్లాలో కడియం ఆటలు సాగనివ్వనని హెచ్చరిక
= పీసీసీకి తలనొప్పిగా వరంగల్ అగ్రనేతల లొల్లి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా బహిరంగ యుద్ధంగా మారింది. ఇద్దరు అగ్ర నేతల మధ్య మొదలైన ఈ ‘ఈగో వార్’ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా పరిణమించింది. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన అత్యంత ఘాటు వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడియం శ్రీహరితో తాను తాడోపేడో తేల్చుకుంటానని, ఆయన ఆధిపత్య వైఖరిని ఎంతమాత్రం సహించేది లేదని సురేఖ స్పష్టం చేయడంతో ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
చేతనైతే రాజీనామా చేయ్..
మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం వెనుక ప్రొటోకాల్, నియోజకవర్గాలపై ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. తన పరిధిని దాటి కడియం శ్రీహరి వ్యవహరిస్తున్నారని కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక ప్రభుత్వ అధికారిపై ఒత్తిడి తెచ్చి, నియమ నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ప్రమేయం లేకుండా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయించడమే ప్రస్తుత వివాదానికి మూల కారణం. నాకంటే సీనియర్ అయిన కడియం శ్రీహరికి ఒక ఎమ్మెల్యే పరిధి ఏంటో తెలియదా? అని సురేఖ ప్రశ్నించారు. గతంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పనిచేసిన కడియం, ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని, ఆ అసంతృప్తితోనే కావాలని సమస్యలు సృష్టిస్తూ జిల్లా రాజకీయాలను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని సురేఖ ఆరోపించారు. ఈ పంచాయితీని మరింత ముందుకు తీసుకెళ్తూ.. కడియం శ్రీహరికి ఆమె నేరుగా రాజీనామా సవాల్ విసిరారు. ‘చేతనైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలిచి, మంత్రి పదవి తెచ్చుకో’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కూతురు కాంగ్రెస్ ఎంపీ.. తండ్రి ద్వంద్వ వైఖరి..
కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ ఆయన ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విషయాన్ని మంత్రి సురేఖ హైలైట్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే, మరోవైపు తాను ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకోవడంపై ఆమె మండిపడ్డారు. తన కూతురు కడియం కావ్యను మాత్రం కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్నారని, కానీ ఆయన మాత్రం పార్టీకి విధేయుడిగా ఉండటం లేదని ఎండగట్టారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లడాన్ని తాను ఎప్పుడూ తప్పుపట్టలేదని, అయితే ఒక ఎమ్మెల్యే నేరుగా మంత్రి శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం ఏ చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎవరైనా తమ నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసి చర్చించవచ్చని, కానీ శాఖ కార్యాలయాల్లో నేరుగా సమీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని హితవు పలికారు.
వలస నేతల కుట్ర అంటూ..
కడియం శ్రీహరి తనపై చేస్తున్న వ్యాఖ్యలు, ప్రవర్తన ఒక బీసీ మహిళగా తనను రాజకీయంగా అవమానించే విధంగా ఉన్నాయని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత స్థాయిలో గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తనపై జరుగుతున్న ఈ విమర్శల వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు నేతలు తనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కడియం శ్రీహరి కూడా టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు కావడంతోనే తనపై ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు పక్కా కాంగ్రెస్ నాయకులతో తనకు ఎలాంటి సమస్యలు లేవని, పార్టీ మారి వచ్చిన కొందరు నేతలే తనపై ఫిర్యాదులు చేస్తూ రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
అధిష్ఠానం తేల్చకపోతే తాడోపేడో
ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యంగా పీసీసీకి పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయమై కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పార్టీకి అధికారికంగా లేఖ రాయగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల ఎవరికీ వివరణ ఇచ్చే ప్రసక్తే లేదని కడియం శ్రీహరి భీష్మించుకు కూర్చున్నారు. అయితే, ఈ సమస్యను పరిష్కరిస్తామని పీసీసీ తనకు హామీ ఇచ్చిందని సురేఖ చెబుతున్నారు. ఒకవేళ అధిష్ఠానం జోక్యం చేసుకోకపోతే, జిల్లాలో కడియం ఆటలు సాగనివ్వనని, తానే స్వయంగా మైదానంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటానని సురేఖ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు కోసం కొండా, కడియం వర్గాల మధ్య ఎప్పటి నుంచో అంతర్గత పోరు నడుస్తోంది. ఇప్పుడు అది అధికారిక సమీక్షలు, ప్రొటోకాల్ వివాదాల రూపంలో రచ్చకెక్కింది. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతేనని, ఆయనకు లేని సమస్యలు సృష్టించడం అలవాటని సురేఖ చేసిన వ్యక్తిగత విమర్శలు ఇరు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. కడియం శ్రీహరి ఈ ఘాటు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి వరంగల్ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది. అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగి ఈ ఇద్దరు సీనియర్ల మధ్య రాజీ కుదర్చకపోతే, రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
