వేద న్యూస్, వరంగల్ టౌన్ : కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అడుప మహేష్ హత్యను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ తీవ్రంగా ఖండించారు. మహేష్ మరణం పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. సోమవారం అయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. నగరంలో రౌడీ మూకల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన కొందరు రౌడీషీటర్లు సెటిల్‌మెంట్లు చేస్తూ, ముఠాలుగా ఏర్పడి తమ ఉనికిని చాటుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
కొంతమంది రాజకీయ నాయకులు, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఇలాంటి రౌడీ మూకలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రౌడీలపై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీలపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించనున్నారని అయూబ్ పేర్కొన్నారు. వరంగల్ ఘటనపై పార్టీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి బెదిరింపులు లేదా దాడులు ఎదురైనా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అయూబ్ హామీ ఇచ్చారు. చివరగా అడుప మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.