తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ పాల్గొని ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల జెండాలతో జీవీ మాల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అసెంబ్లీకి నల్ల టీషర్టులు ధరించి వెళ్లిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రశ్నించడం ప్రతిపక్షం హక్కు అని, ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం సరికాదని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
“పార్లమెంట్లో నల్ల దుస్తులతో నిరసన తెలిపే హక్కు ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అదే హక్కు ఎందుకు ఉండకూడదు?” అని సండ్ర ప్రశ్నించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తడం ప్రతిపక్ష బాధ్యత అని, ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
1000 రోజుల పాలనపై కాంగ్రెస్‌ను నిలదీసిన సండ్ర
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.మహిళలకు నెలకు రూ.2,500, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు స్కూటర్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లో తులం బంగారం, అర్హులైన పేదలకు ఇళ్లు తదితర హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి గ్రామస్థాయి వరకు ప్రజల గొంతుకగా గులాబీ జెండా నిరంతరం పోరాడుతుందని అన్నారు.అనంతరం ప్రజల నుంచి సేకరించిన వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజావాణిలో అధికారులకు సండ్ర వెంకట వీరయ్య సమర్పించారు.

