Gadwal Vijayalakshmi

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా, కేబినెట్‌ మంత్రి హోదాతో గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించి, ప్రజావాణి కార్యక్రమం అమలు తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ పదవిని ఒక మహిళకు అప్పగించడం తొలిసారి అని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ అవకాశం తనకు వ్యక్తిగత గౌరవం కంటే రాష్ట్ర మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ సమగ్ర, సమతుల్య అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు.

కాగా, ఇటీవల ప్రభుత్వం గద్వాల విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌గా నియమించింది. ఆమెకు కేబినెట్‌ మంత్రి హోదా కల్పించింది.ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *