= అసెంబ్లీ లోపల, బయట అధికార, ప్రతిపక్షాల హోరాహోరీ
= వేడెక్కించిన 22-ఏ నిషేధిత భూముల రగడ
= ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు
= సొంత ఆస్తులు పోగేసుకున్నారంటూ ఇరు పార్టీల ఆరోపణలు
= దానం వేటుతో గులాబీ పార్టీలో జోష్
= దూకుడు పెంచిన కేటీఆర్, హరీశ్‌రావు
= అన్నింట్లోనూ బీఆర్ఎస్ ను ఇరికిస్తున్న రేవంత్ వ్యూహం
= వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోని బీజేపీ
= రెండు పార్టీలను ఎండగట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలం
వేద న్యూస్, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముఖాముఖి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా మొదలైన మాటల తూటాలు, నిరసనలు, అరెస్టులతో పాటు 22-A నిషేధిత భూముల వ్యవహారం, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై రెవెన్యూ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు పతాక స్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు అక్రమాస్తులు పోగేసుకున్నారంటూ ఇరు పార్టీల అగ్రనేతలు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వీధుల్లోకి ఎక్కడంతో మొత్తం పొలిటికల్ స్పేస్ ఈ రెండు పార్టీల చుట్టూనే తిరుగుతోంది. వీటికి తోడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన చారిత్రక అనర్హత వేటు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.
22-ఏ నిషేధిత భూముల రగడ
22-ఏ నిషేధిత భూముల వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను అక్రమంగా నిషేధిత జాబితా నుంచి తొలగించి తమ అనుకూల వర్గాలకు ధారాదత్తం చేశారని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆధారాలతో దాడికి దిగింది. ముఖ్యంగా గజ్వేల్ పరిధిలోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూములు, ఆక్రమణలు, 22-ఏ ఉల్లంఘనలపై సమగ్ర రెవెన్యూ సర్వేకు ఆదేశాలు జారీ చేయడం రాజకీయ ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది.దీనికి ప్రతిగా బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ మంత్రుల భూకబ్జాలపై ఎదురుదాడికి దిగడంతో శాసనసభ వేదికగా ఇరుపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
సొంత ఆస్తులపై మాటల యుద్ధం
గజ్వేల్ నియోజకవర్గంలోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూములు, ఆక్రమణలు, అనుమతులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రెవెన్యూ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం రాజకీయ దుమారాన్ని రేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకుందని అధికార పక్షం విరుచుకుపడుతుండగా.. రేవంత్ రెడ్డి సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులే భారీగా ఆస్తులు పోగేసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. శాసనసభలో దళిత స్పీకర్‌ను అవమానించారనే వివాదం నుంచి మొదలుకొని ఎర్రవల్లి భూముల వివాదం వరకు ఇరు పార్టీలు పరస్పరం సవాళ్లు విసురుకుంటూ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.
దానం వేటుతో..
మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన చారిత్రక అనర్హత వేటు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ అధికారిక బీ-ఫారంతో పోటీ చేయడాన్ని తిరుగులేని ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఈ తీర్పుతో ఉపఎన్నిక వస్తే మళ్లీ పోటీ చేస్తానని దానం ప్రకటించడంతో ఖైరతాబాద్‌లో 6 నెలల్లో బైపోల్ అనివార్యమైంది; అంతేకాకుండా ఈ సంచలన తీర్పుతో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగిలిన 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లోనూ అనర్హత భయం మొదలై రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఫీల్డ్‌లో గులాబీ దళం దూకుడు..
లోక్‌సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకు 16-18 శాతానికి పడిపోయినప్పటికీ, తెలంగాణలో స్థిరమైన క్యాడర్, బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఇప్పటికీ తమకే ఉందని బీఆర్ఎస్ నిరూపించుకుంటోంది. కేటీఆర్, హరీశ్‌రావుల నేతృత్వంలో గులాబీ శ్రేణులు అసెంబ్లీ లోపల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు, బయట ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నాయి. ధర్నాలు, అరెస్టులు, నిరసనలతో ప్రజల్లో అధికార పక్షాన్ని ఎండగట్టే ఏకైక శక్తిగా బీఆర్ఎస్సే కనిపిస్తోంది.
బీజేపీని పక్కకు నెట్టిన రేవంత్ రెడ్డి వ్యూహం..
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అత్యంత చాకచక్యంగా బీజేపీని రాజకీయ రేసులోకి రానివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రాజకీయ బాణాలు ఎప్పుడూ కేసీఆర్, ఆయన కుటుంబంపైనే ఎక్కుపెడుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కుట్రలు, గత పదేళ్ల బీఆర్ఎస్ అవినీతి ప్రధాన చర్చగా మార్చడంలో అధికార కాంగ్రెస్ పూర్తిగా సఫలమైంది. ఈ పోరులో మూడో పక్షంగా ఉన్న బీజేపీకి కనీసం మాట్లాడే వేదిక కూడా దొరకడం లేదని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.
మాట్లాడే బీజేపీ నేతలు ఎక్కడ?
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అవినీతి పోరు జరుగుతుంటే.. రెండు పార్టీలను ఎండగట్టి మాట్లాడే బీజేపీ నేతలు కనిపించకపోవడం గమనార్హం. రెండు పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు దూపుకుపోతుంటే.. బీజేపీ మాత్రం చూస్తూ ఉండిపోతుందనేది ఆ పార్టీ కార్యకర్తలే స్వయంగా పెదవి విరుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లు జాతీయ రాజకీయాలు, మోడీ ఇమేజ్‌పై వచ్చినవే తప్ప, రాష్ట్రంలో సంస్థాగత బలం కాదన్న సత్యం ప్రస్తుత పరిణామాలతో తేటతెల్లమవుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే బలం లేకపోవడం, వీధుల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ద్వితీయ శ్రేణి నాయకులే వాపోతున్నారు.
