*ముద్దాపూర్లో భూముల డిజిటల్ రీసర్వే పనులను పరిశీలించిన మెదక్ ఆర్డీఓ రమాదేవి*
• 188 మంది రైతులకు శాశ్వత ప్రయోజనం.. ముద్దాపూర్లో వేగంగా డిజిటల్ రీసర్వే
• భూ వివాదాలు లేకుండా డిజిటల్ రీసర్వే.. ముద్దాపూర్ లో పనులను పరిశీలించిన ఆర్డీఓ
వేద న్యూస్ పాపన్నపేట
మండల పరిధిలోని ముద్దాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల డిజిటల్ రీసర్వే పనులను మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించిన ఆమె, రీసర్వే పనులు జరుగుతున్న తీరును దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ.. ముద్దాపూర్ గ్రామ పరిధిలోని మొత్తం 405 ఎకరాల సాగు భూమికి సంబంధించి, 188 మంది రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా ఈ డిజిటల్ రీసర్వే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 189 ఎకరాల భూమికి సంబంధించిన రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఆమె వివరించారు.
అనంతరం, ఇప్పటికే పూర్తయిన రీసర్వే రికార్డులను, డిజిటల్ మ్యాపులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిగిలిన భూముల రీసర్వే పనులను కూడా ఎలాంటి పొరపాట్లకు గానీ, భవిష్యత్తులో భూ వివాదాలకు గానీ తావులేకుండా అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా, త్వరితగతిన ఈ ప్రక్రియను ముగించాలని సర్వే, రెవెన్యూ అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, ఎమర్వో సతీష్ కుమార్ , ఆర్ ఐ, శరత్ సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
