- మెదక్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ
వేద న్యూస్ పాపన్నపేట
ఎలినినో ప్రభావం మూలంగా వర్షాలు పడక పంటలు ఎండి పోతున్నాయని,కరువు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ఆరోపించారు.మంగళవారం రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు నివారణతో జిల్లాలో ఖరీఫ్ సీజన్ తీవ్రమైన సంక్షోభం ఎదురుకుంటుందన్నారు.మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉంటే కేవలం ఒకే ఒక్క మనోహరబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించటం విడ్డూరంగా ఉందని, ఇది ఎంత వరకు సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.మిగతా మండలాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.ఎకరానికి పంట నష్టం రూ.50000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.జిల్లాలో తాగు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని,త్రాగు నీటి సరఫరా కోసం ప్రత్యేమ్నాయ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని కోరారు. జిల్లాలో రైతులు వేసిన పంటల వివరాలను ప్రకటించి,ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి తదితర వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.గ్రామం యూనిట్‌గా పంట నష్టాన్ని లెక్కించాలన్నారు.జిల్లా కలెక్టర్ ఎండిపోయిన రైతుల పంటలను పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా అధికారులు ఎండిన పంటలను నిర్థిష్టంగా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.జిల్లాలో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి సీఎంఆర్ అప్పగించని రైస్ మిలర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఎంఆర్ కోసం సేకరించిన ధాన్యంలో 3029 టన్నుల బియ్యం తక్కువగా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.జిల్లాలో రైస్ మిల్లులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.
