*భక్తిశ్రద్ధలతో ఏడుపాయల ఆకాశ దీపోత్సవం..*
*దీపాల వెలుగుల్లో మెరిసిన వనదుర్గా ఆలయం!*
వేద న్యూస్, పాపన్నపేట
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన ఆకాశ దీపోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. భక్తులు వెలిగించిన వేలాది ప్రమిదల వెలుగులతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.
కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం వేళ వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ పరిసరాలతో పాటు మంజీరా నదీ పాయల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
