మాజీ ఎంపీడీఓ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి..
వేద న్యూస్, పాపన్నపేట
పాపన్నపేట మండలం ఆర్కేల గ్రామానికి చెందిన విశ్రాంత ఎంపీడీఓ హజముల్లా హుసేని (97) శనివారం రాత్రి వయోభారంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ సభ్యుడు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఆదివారం ఆర్కేల గ్రామానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
అనంతరం హుసేని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్, కుల్చారం, రామాయంపేట మండలాల్లో ఎంపీడీఓగా హజముల్లా హుసేని అందించిన నిజాయితీతో కూడిన సేవలను గుర్తుచేసుకున్నారు.
కాగా, హజముల్లా హుసేనికి ఐదుగురు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆయన భార్య మరణించగా, అప్పటి నుండి వయోభారంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
