- జనంలోనే ఉండటం ప్రభాకర్ నైజం
- మార్నింగ్ వాక్‌లో ప్రజలతో ముచ్చట
వేద న్యూస్, హుస్నాబాద్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థిగా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్..ఇప్పుడు మంత్రిగానూ అదే తీరుతో జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి అయినా..తన శైలి రొటీన్ గానే కొనసాగించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రి హోదా అనే దర్పం లేకుండా ప్రజలతో మమేకం అవుతున్న తీరును చూసి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజానీకం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషపడుతున్నాయి.
రాష్ట్రరవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పొన్నం ప్రభాకర్ మంగళవారం ఉదయాన్నే ‘మార్నింగ్ వాక్’ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో వాకింగ్ చేసి జనంతో మాట్లాడారు. ఎంత ఎదిగానా ఒదిగే ఉంటాననే విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారు. తనను ఆదరించిన హుస్నాబాద్ ప్రజలను మరిచిపోనని, రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
సెక్యూరిటీని దూరంగా పెట్టి హుస్నాబాద్ అంబేద్కర్ సెంటర్ నుంచి వాకింగ్ చేసి జనం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టణమంతా కలియదిరిగిన తీరును చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. తన వద్దకు జనం రావడం కాకుండా..తానే జనం మధ్యకు వస్తానని అందుకు ‘మార్నింగ్ వాక్’ చేస్తానని వెల్లడించారు. ఇదే రీతిన జనంతో ముందుకెళితే తప్పకుండా పొన్నం ప్రభాకర్ తిరుగులేని నాయకుడిగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
