•  కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు
  • ‘దళిత బంధు’ ఇచ్చేది తమ ప్రభుత్వమేనని వ్యాఖ్య
  • హస్తం నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఊరుకోబోమని హెచ్చరిక

వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీ ఆర్ ఎస్ సర్కార్, అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ “దళిత బంధు” సాధన సమితి నాయకుల ప్రకటనల వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒకే ఒక ఎజెండాగా పెట్టుకొని సాధన సమితి పేరుతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. అలా చేయడం వల్ల దళితులకు నష్టమే తప్ప లాభం లేదని వివరించారు. సాధన సమితి వారి చర్యల వల్ల ‘దళిత బంధు’ వస్తాదో..రాదో అనే అనుమానంతో లబ్ధిదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిండు అసెంబ్లీలో అసెంబ్లీలో ‘‘దళిత బంధు’’ కచ్చితంగా లబ్ధిదారులకు అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. ఒకసారి మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని తెలిపారు. తాము కూడా దళితులమేనని, తాము తమ పార్టీ, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లామని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘దళిత బంధు’’ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దళితుల పక్షాన హస్తం పార్టీ ఉందన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ బాబు, టీపీసీసీ మెంబర్ పత్తి కిష్ణారెడ్డి, నాయకత్వంలో రెండో విడత “దళిత బంధు” ఇస్తామని ప్రకటించారు.

‘దళిత బంధు’ ఇచ్చేది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారేనని మరోమారు నేతలు స్పష్టం చేశారు. కొందరు నాయకుల విమర్శల వల్ల రెండో విడత ‘దళిత బంధు’ పథకం అమలు జాప్యమైందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్, దొడ్డే నవీన్, శ్రీకాంత్, అశోక్, అనిల్, సురేష్, రమేష్, దిలీప్, సాగర్, సాయికిరణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.