• పోస్ట్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు
  •  వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
  •  వరంగల్ డివిజన్ తపాలా శాఖ పర్యవేక్షకులు ఎస్.వి.ఎల్.ఎన్ రావు

వేద న్యూస్, మరిపెడ:
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ‘ప్రధాన మంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి’ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి పోస్టాఫీసు ద్వారా రిజిస్ట్రేషన్ లు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, సహజ వనరులను కాపాడుకోవడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం..గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టిసారించింది.

దీని కింద ఇప్పటికే సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లను అమర్చనున్నారు. దీనిద్వారా వారు సౌర విద్యుత్తును వినియోగించుకోవడంతో పాటు కరెంటు బిల్లులు భారం కూడా తగ్గుతుంది.

సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ చార్జీల భారం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య గర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌తో దేశవ్యాప్తంగా ఇళ్లకు సబ్సిడితో సోలార్ రూఫ్ ప్లాంట్లను నిర్మించి ఇచ్చి, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించే ఈ పథకానికి పోస్టాఫీసు ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించారు.

ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పోస్టల్ సిబ్బంది సౌజన్యంతో మొదలు పెట్టారు. ఆసక్తి కలిగిన వినియోగ దారులు పోస్టల్ సిబ్బందికి తమ వివరాలను అందజేస్తే, వారు ఆ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. నమోదైన తర్వాత సంబంధిత అధికారులు సోలార్ ప్లాంట్ లను ఇన్ స్టాల్ చేస్తారు.

 ప్రజలు అత్యధిక సంఖ్య లో నమోదు చేసుకోగలరని మహబూబాద్ ప్రధాన తపాలా కార్యాలయంలో వరంగల్ డివిజన్ తపాలా శాఖ పర్యవేక్షకులు యస్.వి.ఎల్.ఎన్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన కర పత్రాన్ని విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని పోస్టాఫీసు ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు ఎల్. సైదా నాయక్, మహబూబాబాద్ పోస్ట్ మాస్టర్ పెండ్ర రాంచందర్, జి. సుధాకర్, బి. ప్రశాంత్, కంబాలపల్లి ఉప తపాల కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.