- జూనియర్ లెక్చరర్‌గా రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాయిన్
- మట్టిలో మాణిక్యమే కాదు.. ఆరె జాతి రత్నం కూడా..
- 4 కొలువులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిన కిర్మరే సుధాకర్
- టీజీటీ, పీజీటీతో పాటు ఎస్ఏ జాబ్స్.. అనంతరం జేఎల్ కొలువు
వేద న్యూస్, ఆసిఫాబాద్:
పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చని నిరూపించారు ఓ యువకుడు. మారుమూల పల్లెలోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పోటీ ప్రపంచంలో తన కాళ్లపై తాను నిలబడి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించి.. స్ఫూర్తి ప్రదాతగా నిలిచి.. ఆ ఊరి నుంచి తొలి జేఎల్(జూనియర్ లెక్చరర్-గెజిటెడ్ ఆఫీసర్)గా సర్కారీ కొలువు సంపాదించి ఊరి పేరు నిలబెట్టాడు. అయితే, ఈ కొలువు రావడాని కంటే ముందరే సదరు యువకుడు సర్కారీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తుండటం విశేషం.

జేఎల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న క్రమంలో తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండగా, బాగోగులు చూసుకున్నారు. పరిస్థితి విషమించి ఆమె కాలం చేయగా, తల్లి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లారు. మొక్కవోని దీక్షతో పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల ప్రభుత్వ జేఎల్ కొలువు సంపాదించి ఉన్న ఊరు, కన్నతల్లి పేరు నిలబెట్టారు. మట్టిలో మాణిక్యం మాత్రమే కాకుండా ఆరె జాతి రత్నం అని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రయత్నం చేశాడు ఆ యువకెరటం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సర్కారీ కొలువులు ఒక దాని తర్వాత మరొకటి సంపాదించాడు. ఇదీ సంక్షిప్తంగా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ కిర్మరే సుధాకర్ స్టోరీ..

మట్టిలో మాణిక్యం..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల పరిధిలోని హుడ్కిలి గ్రామానికి చెందిన కిర్మరే విమలబాయి-సాయినాథ్ దంపతులకు 1990 నవంబర్ 5న జన్మించిన సుధాకర్.. పువ్వు పుట్టగానే పరమళిస్తుందనే రీతిలో.. తొలి నుంచి చదువులో రాణిస్తున్నారు. ఎడ్యుకేషన్‌తో పాటు ఆటల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉన్న సుధాకర్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం.. చిన్న నాటి నుంచి పుస్తకాలపైనా ఇంట్రెస్ట్‌తో హాయిగా పుస్తకాలను పఠించడం అలవాటు చేసుకున్నాడు. విద్యతో విజయం సాధించాలని చిన్ననాటే కలలు కన్నాడు. ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, తమ్ముళ్ల ప్రేమానురాగాలు పొందిన సుధాకర్.. తను పుట్టి పెరిగిన ఊరుతో పాటు కుటుంబం గర్వించేలా జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుక్షణం శ్రమిస్తూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగి విజేతయ్యాడు.

ఓ వైపు బోధిస్తూ.. మరో వైపు పోటీ పరీక్షలకు సన్నద్ధం
హుడ్కిలిలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్న సుధాకర్..
జక్కపుర్‌లో 6, 7 తరగతులు చదువుకున్నాడు. సిర్పూర్ టీ మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్‌లో 8 నుంచి పదో తరగతి వరకు చదువుకుని.. ఎస్సెస్సీలో 75 % మార్కులు సంపాదించారు. అదే మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్‌లో
64 % తో ఉత్తీర్ణులయ్యారు.
అనంతరం పై చదువులకు కాగజ్‌నగర్ వెళ్లాడు. అక్కడ ఎస్‌కేఈ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో బీఈడీ, ఆగ్రాలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిందీలో ఎంఈడీ కంప్లీట్ చేశారు. డిగ్రీ అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడం ప్రారంభించిన సుధాకర్.. సుమారు ఆరేండ్లు ప్రైవేటు టీచర్‌గా ఓ వైపు బోధిస్తూ.. మరో వైపు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. ఓయూలో హిందీలో పీహెచ్‌డీ సైతం చేస్తున్నారు.
పట్టుదలతో ముందుకు సాగిన సుధాకర్..
ఈ క్రమంలోనే 2024 ఆగస్టులో టీజీటీ(ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) రెండు కొలువులు సాధించారు. టీజీటీలో 7వ, పీజీటీలో 2వ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. తొలుత టీజీటీ సాధించారు. నెక్స్ట్ పీజీటీ సాధించి ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో పీటీజీ గురుకులంలో పీజీటీ ఉపాధ్యాయ కొలువులో జాయిన్ అయి.. 2 నెలల పాటు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో ఎస్ఏ హిందీలో జిల్లాస్థాయి 2వ ర్యాంకు సాధించి జిల్లాకేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో టీచర్‌గా జాబ్ పొందారు.
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే తాజాగా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్‌లో రాష్ట్ర స్థాయి 61వ ర్యాంకు సాధించి రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జేఎల్‌గా విధుల్లో చేరారు. సుధాకర్ తమ్ముళ్లు.. దివాకర్ టైలర్‌గా స్వయం ఉపాధి పొందుతుండగా, దీపక్ పీజీ చదువుతున్నాడు. తమ గ్రామ యువకుడు సుధాకర్ జేఎల్ (గెజిటెడ్ ఆఫీసర్)గా కొలువు సంపాదించడం పట్ల హుడ్కిలి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి సుధాకర్ ఎదగాలని ఆకాంక్షించారు.
యూనివర్సిటీ ప్రొఫెసర్ కావడం నా లక్ష్యం: కిర్మరే సుధాకర్
నేను ప్రభుత్వ జేఎల్ కొలువు సంపాదించడంలో కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. తల్లిదండ్రులు విమలబాయి-సాయినాథ్, తమ్ముళ్లు దివాకర్, దీపక్, నా జీవిత భాగస్వామి రోజా నాకు అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఓ వైపు బోధన కొనసాగిస్తూ.. మరో వైపు జేఎల్ ఉద్యోగం సంపాదించేందుకు ప్రిపేర్ అయ్యాను. విద్యతో సమాజంలో మార్పు అనివార్యంగా వస్తుందని నేను భావిస్తున్నాను. సొసైటీ ప్రగతి పథంలో సాగాలంటే విద్యనే ఆయుధమని నేను నమ్ముతాను. అక్ష్యరాస్యతతో ఆటోమేటిక్‌గా అభివృద్ధి వైపు పయనం సాగుతుంది. నా అంతిమ లక్ష్యం యూనివర్సిటీలో ప్రొఫెసర్ కావడమే.