నీటి ఆవాస జీవవైవిద్యం – బఫర్ జోన్ ఆవశ్యకత

  • నీటి ఆవాసాలు – బఫర్ జోన్స్ అవసర ప్రముఖ్యత – శాస్త్రీయ విశ్లేషణ
  • ప్రాజెక్టులు ఏవైనా – పర్యావరణ హితం కావాలి
  • ప్రభుత్వాలు చెరువుల బఫర్ జోన్స్ జీవవైవిద్యం ప్రముఖ్యతను గుర్తించి మెదులుకోవాలి
  • నీటి ఆవాసాలా పచ్చదనాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత

నీటి ఆవాసాలు – బఫర్ జోన్స్ ప్రముఖ్యత, డేటా ఆధారిత శాస్త్రీయ విశ్లేషణ: పర్యావరణ శాస్త్రం మరియు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒక సరస్సు లేదా చెరువు చుట్టూ ఉండే బఫర్ జోన్ (బఫర్ జోన్) ఆ జలవనరు యొక్క ‘ఊపిరితిత్తుల’ వంటిది. ఇది కేవలం ఖాళీ స్థలం కాదు, ఒక సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థ. బఫర్ జోన్ యొక్క శాస్త్రీయ పరిమితులు (సైంటిఫిక్ బౌండరీస్): భారతదేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జి.టీ) మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిబంధనల ప్రకారం, బఫర్ జోన్ దూరం జలవనరు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. జలవనరు రకం, నిర్ణీత బఫర్ జోన్ దూరం (తీరం నుండి) ఆధారంగా పెద్ద సరస్సులు (లేక్స్) – 75 మీటర్లు, రాజకాలువలు / ప్రధాన కాలువలు – 50 మీటర్లు, సాధారణ చెరువులు / కుంటలు – 30 మీటర్లు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది పర్యావరణ సున్నిత ప్రాంతాలు (ఏకో-సెన్సిటివ్ జోన్స్) అయితే, ఈ దూరం శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా 100 నుండి 200 మీటర్ల వరకు పెంచవచ్చు.

బఫర్ జోన్ యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత (సైంటిఫిక్ ఇంపార్టెన్స్): బఫర్ జోన్ ప్రధానంగా మూడు రకాలుగా పనిచేస్తుంది: 1. సహజ వడపోత కేంద్రం (నేచురల్ ఫిల్టర్)
సరస్సులోకి ప్రవహించే వర్షపు నీటిలోని కాలుష్య కారకాలను (నైట్రేట్లు, ఫాస్ఫేట్లు) బఫర్ జోన్‌లోని మొక్కలు, గడ్డి పీల్చుకుంటాయి. దీనిని పైటోరిమెడియేషన్ అంటారు. ఇది లేకపోతే సరస్సులో యూట్రోఫీకేషన్ (అధిక పోషకాల వల్ల నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గిపోవడం) జరిగి చేపలు చనిపోతాయి. 2. భూగర్భ జలాల పునరుద్ధరణ (గ్రౌండ్ వాటర్ రీఛార్జ్) బఫర్ జోన్ లోని మట్టి మరియు రాళ్ల పొరలు నీటి వేగాన్ని తగ్గించి, భూమిలోకి ఇంకేలా చేస్తాయి. ఇది స్థానిక భూగర్భ జల మట్టాన్ని పెంచుతుంది. 3. జీవవైవిధ్య నిలయం (బయోడైవర్సిటీ హబ్) జలచరాలకు మరియు భూచరాలకు మధ్య ఇదొక ఎకోటోన్ (రెండు పర్యావరణ వ్యవస్థల కలయిక) గా పనిచేస్తుంది. పక్షుల సంతానోత్పత్తి: నెమళ్లు, నీటి పక్షులు గుడ్లు పెట్టడానికి, పిల్లలను పెంచడానికి పొదలతో కూడిన బఫర్ జోన్ అవసరం. ఆహార గొలుసు: కీటకాలు, ఉభయచరాలు (కప్పలు), చిన్న క్షీరదాలకు ఇది ఆశ్రయం కల్పిస్తుంది.

డేటా ఆధారిత విశ్లేషణ: బఫర్ జోన్ లేకపోతే కలిగే నష్టాలు: శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, బఫర్ జోన్ ఆక్రమణకు గురైతే: నీటి ఉష్ణోగ్రత పెరుగుదల: గట్టు మీద చెట్లు లేకపోతే నీటి ఉష్ణోగ్రత 2° నుండి 5° వరకు పెరుగుతుంది, ఇది జలచరాల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. పూడిక (సేడిమేంటేషన్): బఫర్ జోన్ లేకపోతే నేరుగా మట్టి కొట్టుకువచ్చి సరస్సులో చేరుతుంది. దీనివల్ల సరస్సు నీటి నిల్వ సామర్థ్యం ఏడాదికి సగటున 1-2% తగ్గుతుంది. వరదలు: బఫర్ జోన్ ఒక ‘స్పాంజ్’ లా పనిచేసి అదనపు నీటిని పీల్చుకుంటుంది. ఇది లేకపోతే సమీప నివాస ప్రాంతాలు ముంపుకు గురవుతాయి.

ఉదాహరణంగా అమీన్‌పూర్ చెరువు – జీవవైవిధ్యవినాశనం: అమీన్‌పూర్ జీవవైవిధ్య వారసత్వ ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు, బఫర్ జోన్ యొక్క ప్రాముఖ్యత మరియు పర్యావరణ సమతుల్యతపై శాస్త్రీయ విశ్లేషణ: అమీన్‌పూర్ జీవవైవిధ్యం: పర్యావరణ సమతుల్యత మరియు బఫర్ జోన్ ఆవశ్యకత, నీటి ఆవాసాలు మరియు జీవవైవిధ్యం ఒక విడదీయలేని బంధం. ప్రకృతిలో నీటి ఆవాసాలు (ఆక్వాటిక్ ఏకోసిస్టంస్) కేవలం నీటి నిల్వలు మాత్రమే కావు; అవి వేలాది జీవరాశులకు ప్రాణాధారమైన సంక్లిష్ట వ్యవస్థలు. ఒక సరస్సు లేదా చెరువు యొక్క ఆరోగ్యం అది కలిగి ఉన్న నీటి నాణ్యతపై మాత్రమే కాక, దాని చుట్టూ ఉన్న భూభాగం (రిపరియన్ జోన్ /బఫర్ జోన్) పై ఆధారపడి ఉంటుంది. అమీన్‌పూర్ పెద్ద చెరువు దేశంలోనే మొట్టమొదటి పట్టణ జీవవైవిధ్య వారసత్వ ప్రాంతం (బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్) గా గుర్తింపు పొందడానికి కారణం అక్కడ ఉన్న అరుదైన పక్షులు, వృక్షజాలం మరియు రాతి గుట్టల కలయికతో కూడిన విలక్షణమైన పర్యావరణమే. బఫర్ జోన్ ప్రాముఖ్యత: శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయంగా, ఒక జలవనరు చుట్టూ ఉండే నిర్ణీత దూరాన్ని ‘బఫర్ జోన్’ అంటారు. ఇది జలవనరుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

సహజ వడపోత (నాచురల్ ఫిల్ట్రేషన్): చెరువు చుట్టూ ఉండే గడ్డి, మొక్కలు మరియు పొదలు వర్షపు నీటితో వచ్చే వ్యర్థాలను, రసాయనాలను వడపోసి స్వచ్ఛమైన నీటిని లోపలికి పంపుతాయి. ఆవాసాల అనుసంధానం: అమీన్‌పూర్ వంటి ప్రాంతాల్లోని రాతి గుట్టలు (హిల్లొక్స్) నెమళ్లు, అడవి పిల్లులు మరియు ఇతర క్షీరదాలకు సురక్షితమైన సంతానోత్పత్తి కేంద్రాలు. ఇక్కడ బఫర్ జోన్ దెబ్బతింటే, జీవుల మధ్య ‘నివాస విచ్ఛిన్నం’ (హ్యాబిటట్ ఫ్రాగ్మెంటేషన్) జరిగి అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.

అమీన్‌పూర్ ఉదాహరణగా మురుగు శుద్ధి పేరిట పచ్చని ప్రకృతికి ఎనలేని నష్టం: ప్రస్తుతం అమీన్‌పూర్ సర్వే నంబర్ 993లో జరుగుతున్న పరిణామాలు పర్యావరణ ప్రేమికులను కలవరపెడుతున్నాయి. అమృత్ 2.0 పథకం కింద రూ. 222 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మించడం మంచి ఉద్దేశ్యమే అయినప్పటికీ, దాని కోసం ఎంచుకున్న స్థలం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైనది. రాకాసి జేసీబీల పంజా: దశాబ్దాల కాలంగా నెమళ్లు, అరుదైన పక్షులకు నిలయంగా ఉన్న గుట్టలను జేసీబీలతో పిండి చేయడం వల్ల ఆ జీవుల సహజ ఆవాసాలు శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి.

జాతీయ పక్షి అయిన నెమళ్ల గూళ్లను చెరిపివేస్తూ సాగుతున్న ఈ పనులు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 స్ఫూర్తికి విరుద్ధం. అధికార యంత్రాంగం వాదన vs వాస్తవం: ఎస్టీపీ వల్ల దుర్వాసన రాదని అధికారులు భరోసా ఇస్తున్నప్పటికీ, అసలు సమస్య దుర్వాసన మాత్రమే కాదు.

పది ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని ప్రకృతిని, జీవవైవిధ్య కేంద్రాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చడం వల్ల స్థానిక పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.
నిబంధనల విస్మరణ మరియు భావితరాల ముప్పు పర్యావరణ నియమాల ప్రకారం, ఇటువంటి హెరిటేజ్ సైట్ల సమీపంలో ఏవైనా భారీ నిర్మాణాలు చేపట్టే ముందు పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అస్సేస్మెంట్ (ఇ.ఐ.ఏ.) క్షుణ్ణంగా జరగాలి. అమీన్‌పూర్‌లో నిబంధనలను తుంగలో తొక్కి గుట్టలను తవ్వడం వల్ల: మైక్రో-క్లైమేట్ మార్పు: చెట్లు, రాళ్లు తొలగించడం వల్ల స్థానిక ఉష్ణోగ్రత పెరిగి, పక్షుల వలసలు తగ్గిపోతాయి. పూడిక సమస్య: బఫర్ జోన్ లోని సహజ అడ్డంకులు లేకపోతే, వర్షపు నీటితో పాటు మట్టి కొట్టుకువచ్చి చెరువులో పూడిక పెరుగుతుంది, ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.

ప్రభుత్వాలు చెరువుల బఫర్ జోన్ల జీవవైవిధ్య ప్రముఖ్యతను గుర్తించి మెదులుకోవాలి: చెరువులు, సరస్సులు, కొలనులు, తటాకాలు మన సమాజానికి కేవలం నీటి నిల్వలుగా మాత్రమే కాకుండా, సంపూర్ణ జీవావరణ వ్యవస్థలకు ఆధార బలంగా పనిచేస్తాయి. అయితే పట్టణ విస్తరణ, అక్రమ నిర్మాణాలు, పరిశ్రమల పెరుగుదల వల్ల ఈ నీటి ఆవాసాలు వేగంగా నశిస్తున్నాయి. ముఖ్యంగా బఫర్ జోన్ల రక్షణ లేకపోవడం జీవవైవిధ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. చెరువుల చుట్టూ ఉండాల్సిన రక్షణ ప్రాంతమైన బఫర్ జోన్ మట్టి ధూళి ప్రవాహాలను తగ్గించడం, కాలుష్య నిరోధం, సహజ నీటి ప్రవాహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. బఫర్ జోన్లు జీవవైవిధ్య సంరక్షణకు అత్యవసరం. పక్షులు, చేపలు, సరీసృపాలు, పురుగులు, నీటి మొక్కలు వంటి జీవరాశులు తమ నివాసం, ఆహారం, సంభవనం కోసం వీటిపై ఆధారపడతాయి. బఫర్ జోన్ లేకుండా ఆవాసం విచ్ఛిన్నమై జాతుల అంతరించుకుపోవడానికి దారి తీస్తుంది. అదనంగా, ఈ ప్రాంతాలు మానవ జోక్యాన్ని తగ్గించడం ద్వారా వన్యప్రాణి–మానవ ఘర్షణలను కూడా తగ్గిస్తాయి. పలు శాస్త్రీయ సంస్థలు, ఎన్.జి.టీ. మరియు పర్యావరణ నిపుణులు చెరువుల చుట్టూ శాస్త్రీయంగా కనీసం 100 మీటర్లు, పెద్ద సరస్సుల వద్ద 200–300 మీటర్ల బఫర్ జోన్ అవసరమని సూచిస్తున్నారు. ఈ దూరం నీటి నాణ్యతను కాపాడడమే కాదు, వరదల సమయంలో చెరువుల భౌతిక స్థితిని కూడా రక్షిస్తుంది. అయితే వీటి అమలులో ప్రభుత్వాల పాత్ర అత్యంత కీలకం.

ప్రభుత్వాలు జలవనరుల బఫర్ జోన్లను భౌగోళికంగా మ్యాప్ చేసి, చట్టబద్ధంగా రక్షణ కల్పించాలి. బఫర్ జోన్‌లో ఏ రకమైన నిర్మాణాలు, కాలుష్యకర కార్యకలాపాలు పూర్తిగా నిషేధించాలి. జీవవైవిధ్య కమిటీలను బలోపేతం చేసి, చెరువులకు సంబంధించిన పర్యావరణ డేటాను నమోదు చేయడం ద్వారా సంరక్షణ చర్యలు మరింత శాస్త్రీయంగా చేయాలి. తీర ప్రాంతాల్లో స్థానిక వృక్షాలను నాటడం, చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమూ అత్యవసరం.

మొత్తంలో చెరువులు మన భవిష్యత్తు పర్యావరణ భద్రతకు మూలస్తంభాలు. వాటిని కాపాడటానికి బఫర్ జోన్ల రక్షణ ప్రభుత్వాలకు అత్యున్నత ప్రాధాన్యత కావాలి. ఇది నీటి భద్రత, జీవవైవిధ్య సంరక్షణ, మరియు వాతావరణ సమతుల్యానికి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది.

పరిష్కార మార్గాలు: అభివృద్ధి మరియు పర్యావరణ సంరక్షణ రెండూ సమాంతరంగా సాగాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు అవసరమే, కానీ అవి ప్రకృతిని నాశనం చేసి కాదు.

ఉదాహరణంగా తీసుకుంటున్న అమీన్‌పూర్ జీవవైవిధ్యానికి తూట్లు పొడవకుండా ఉండాలంటే, ప్రభుత్వం తక్షణమే స్పందించి: సర్వే నంబర్ 993 వంటి పర్యావరణ సున్నిత ప్రాంతాలను వదిలి, ప్రత్యామ్నాయ స్థలాల్లో ప్లాంట్లను నిర్మించాలి. బఫర్ జోన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, అరుదైన వన్యప్రాణుల ఆవాసాలను కాపాడాలి. ప్రకృతి విధ్వంసం జరిగితే అది కేవలం ఈనాటి సమస్య కాదు; రేపటి తరానికి మనం ఇచ్చే ఆక్సిజన్, నీరు మరియు సహజ సంపదను దూరం చేయడమే.

అమీన్‌పూర్ లాంటి నీటి ఆవాసాలా పచ్చదనాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత: అమీన్‌పూర్ వంటి జీవవైవిధ్య వారసత్వ సంపద కలిగిన ప్రాంతాల్లో, బఫర్ జోన్ అనేది కేవలం చట్టపరమైన దూరం మాత్రమే కాదు, అది వన్యప్రాణుల మనుగడకు ప్రాణాధారం.

ముఖ్యంగా నెమళ్లు మరియు అడవి పిల్లుల (జంగల్ కేట్స్ ) వంటి జీవులకు పొదలు, విదేశీ విహాంగాలు ఉదాహరణకు ప్రతిసాంవత్సరం వచ్చే సైభీరియన్ పక్షులు చెట్లతో కూడిన ఈ ప్రాంతం లేకపోతే అవి శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందమైన విదేశీ పక్షులు రాకుండా పోయే ప్రమాదమున్నది. కాబట్టి ప్రభుత్వాలు తమ ఆలోచనను వేరే దగ్గరికి మార్చుకొని ముందుకు సాగాలి. నీటి ఆవాసాలా బఫర్ జోన్స్, పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత.

రవిబాబు పిట్టల, ఎం.ఎస్సీ., ఎం.టెక్., (పిహెచ్.డి), పర్యావరణవేత్త, మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జే.యన్.టీ.యు.హెచ్, హైదరాబాద్ మరియు జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జి.ఓ., తెలంగాణ స్టేట్, ఇండియా. మొబైల్: +91 9849425271