- సమతుల్య జీవనానికి ఈ రెండూ అవసరం
- అవి వైద్యం, ఆధ్యాత్మికత
వేద న్యూస్, జమ్మికుంట:
డిసెంబర్ 21వ తేదీని ప్రతి ఏడాది ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ధ్యానం (మెడిటేషన్) అంటే సరళంగా చెప్పాలంటే.. మనసును ఏకాగ్రతతో ఒకే చోట నిలపడం. సంస్కృతంలో ‘ధై’ అనే ధాతువు నుండి ధ్యానం అనే పదం వచ్చింది, దీని అర్థం “ఆలోచించడం” లేదా “ధ్యాస పెట్టడం”.చాలామంది ధ్యానం అంటే ఆలోచనలను బలవంతంగా ఆపేయడం అనుకుంటారు, కానీ అది నిజం కాదు.
ధ్యానం అంటే మనసులోకి వచ్చే ఆలోచనలను గమనిస్తూ, వాటితో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండటం. ధ్యానం అసలు ఉద్దేశ్యం అంతర్ముఖం అవ్వడం.. అంటే బయట ప్రపంచంలో జరిగే గందరగోళం నుండి తప్పుకుని, మన లోపలికి మనం ప్రయాణించడం. మనసులోకి వచ్చే కోపం, ఆనందం, బాధ వంటి భావాలను ఒక సాక్షిలా గమనించడం. గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా “ఈ క్షణం” లో వర్తమానంలో ఉండటం.
ధ్యానం ఎలా చేయాలి?
మీరు ధ్యానం మొదలుపెట్టాలనుకుంటే ఈ చిన్న పద్ధతి పాటించండి. స్థిరమైన ఆసనం అంటే.. ప్రశాంతమైన చోట వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. శ్వాసపై ధ్యాస కళ్లు మూసుకుని మీ శ్వాస లోపలికి ఎలా వెళ్తోంది, బయటకు ఎలా వస్తోంది అనేది గమనించండి..
ఆలోచనలు వస్తే: ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు రావడం సహజం. అవి వచ్చినప్పుడు కంగారు పడకుండా, మళ్లీ నెమ్మదిగా మీ ధ్యాసను శ్వాస మీదకు మళ్లించండి.ధ్యానం వల్ల కలిగే ముఖ్య లాభాలు మనశ్శాంతి, ఆరోగ్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం.
వైద్యమా.. ఆధ్యాత్మికతా.. ఏది ముఖ్యం?
ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రశ్నతో అయోమయంలో పడుతున్నారు. అదేంటంటే..“వైద్యమే ముఖ్యమా? ఆధ్యాత్మికతే ముఖ్యమా?” ఈ ప్రశ్నకు సమాధానం ప్రముఖ వైద్యుడు, గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ చెప్పారు. వైద్యంతో పాటు ఆధ్యాత్మికత..రెండూ ముఖ్యమేనని, రెండూ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుందని చెప్పారు. మన శరీరం ఒక యంత్రంలాంటిదని, దానికి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ అవసరమని స్పష్టం చేశారు.
వైద్య శాస్త్రం..వ్యాధిని గుర్తిస్తుందని, మందులు, చికిత్సలతో ఉపశమనం కలిగించి..ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. అయితే, ఈ క్రమంలో జ్వరమొచ్చినా, షుగర్ వచ్చినా, బీపీ పెరిగినా “ధ్యానం చేస్తే సరిపోతుంది” అని మందులు వదలడం సరైనది కాదని, అలా చేయడం అవివేకమని తెలిపారు.
ఆధ్యాత్మికత శరీరానికి కాదు, మనస్సుకు ఔషధం వంటిదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక సాధనల వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, భయం, కోపం, ఆందోళన తగ్గుతాయని, కష్టాలను స్వీకరించే శక్తి పెరుగుతుందని వెల్లడించారు.
