రికార్డుల్లో టెన్త్ సర్టిఫికెట్ లేదట..!
= ఈఓ నాగేశ్వరరావు విద్యార్హతపై మరో ఆరోపణ
= దేవాదాయ శాఖలో కనిపించని పదో తరగతి సర్టిఫికెట్‌
= తమ రికార్డుల్లో లేదంటున్న శాఖ ఉన్నతాధికారులు..!
= మిస్ అయ్యిందా..? లేక చదువుకోలేదా..?
= అసలు ఉద్యోగం ఎలా వచ్చింది..?
= చర్చనీయాంశంగా మారిన మరో వ్యవహారం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
బాలానగర్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో వెలుగులోకి వచ్చిన ‘ఈఓ స్కామ్’ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే శాశ్వత కళ్యాణం టికెట్లలో అక్రమాలు, రసీదు బుక్కుల మాయం, ఆలయ ఆదాయంలో అవకతవకలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఓ నాగేశ్వరరావుపై ఇప్పుడు మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. ఉద్యోగ నియామక సమయంలో సమర్పించిన పదో తరగతి సర్టిఫికెట్ నకిలీ అయి ఉండొచ్చనే ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలు నిజమని అధికారిక విచారణలో తేలితే, తప్పుడు విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, ఏళ్ల తరబడి దేవాదాయ ధర్మాదాయ శాఖను మోసం చేసినట్లవుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆలయ ఆర్థిక వ్యవహారాలపై కొనసాగుతున్న వివాదాలకు ఈ కొత్త ఆరోపణలు జత కావడంతో వ్యవహారం మరింత తీవ్రంగా మారింది.

‘టెన్త్ సర్టిఫికెట్’పై అనుమానాలు..
గత ఈఓ సమర్పించిన విద్యార్హతలపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెన్త్ సర్టిఫికెట్ అసలుదా? లేక నకిలీదా? నియామక సమయంలో పత్రాల ధృవీకరణ జరిగిందా? సంబంధిత అధికారులు విద్యార్హతలను పరిశీలించారా? నియామక ప్రక్రియలో ఎవరైనా సహకరించారా? ధృవీకరణలో నిర్లక్ష్యం జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దేవాదాయ శాఖపై పెరుగుతున్న ఒత్తిడి
ఆర్థిక అక్రమాలపై ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో కొత్త ఆరోపణలు రావడంతో దేవాదాయ శాఖపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ అంశంపై అధికారికంగా స్పందించి, నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని భక్తులు కోరుతున్నారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *